44 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితుల్లో దొరికిన మృతదేహం

26 Sep, 2018 20:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చనిపోవడానికి ముందు రోజు తిన్న గింజల ఆధారంగానే ఓ వ్యక్తి అవశేషాలు బయటపడ్డాయి. మరణించిన తర్వాత పొట్ట నుంచి మొలకెత్తిన విత్తనం.. అతడి కుటుంబ సభ్యుల 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన వివరాలు.. మిర్రర్‌ కథనం ప్రకారం.. 1974లో గ్రీకు సైప్రోయిట్స్‌, టర్కిష్‌ సైప్రోయిట్స్‌ గ్రూప్స్‌ మధ్య జరిగిన యుద్ధంలో అహ్మద్‌ హెర్గూన్‌ అనే టర్కిష్‌ వ్యక్తిపై బాంబు దాడి జరిగింది. అతడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. వారిద్దరి శవాలు దొరికాయి గానీ అహ్మద్‌ శవం మాత్రం కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. ఒకవేళ బాంబు దాడిలో అతడు మరణించలేదేమో.. ఎక్కడైనా సురక్షితంగానే ఉన్నాడేమోనని ఆశతో బతికారు. కానీ 44 ఏళ్ల అనంతరం ఓ చెట్టు వల్ల అతడు బతికి లేడనే నిజం వారికి తెలిసింది.

అసలేం జరిగింది...
1974లో బాంబు దాడికి గురైన అనంతరం అహ్మద్‌ ఓ గుహలోకి వెళ్లి దాక్కున్నాడు. కానీ తీవ్ర గాయాలపాలవడంతో అతడు మృతి చెందాడు. అయితే చనిపోవడానికి ముందు రోజు అతడు ఫిగ్‌ ట్రీ గింజలను తిన్నాడు. మరణించిన తర్వాత అతని పొట్టలో మిగిలి పోయిన ఫిగ్‌ విత్తనం సుమారు 44 ఏళ్ల తర్వాత మొలకెత్తింది. అదే అహ్మద్‌ జాడను తెలుసుకోవడంలో కీలక పాత్ర పోషించింది.

ఓ పరిశోధకుడి కారణంగా..
చెట్లపై పరిశోధనలు చేస్తున్న ఓ ఔత్సాహికుడు అహ్మద్‌ మృతదేహం పడి ఉన్న గుహలోకి వెళ్లాడు. అయితే అప్పటికీ అక్కడ ఓ మనిషి తాలూకు అవశేషాలు ఉన్నాయని అతడికి తెలియదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఫిగ్‌ ట్రీ అతడిని ఆకర్షించడంతో ఆ చోటికి చేరుకున్నాడు. ఎందుకంటే అహ్మద్‌ మృతదేహం పడి ఉన్న పరిసరాల్లో అసలు ఫిగ్‌ ట్రీలు మొలకెత్తే అవకాశమే లేదు. దీంతో ఆ చెట్టు పుట్టుక గురించి తెలుసుకోవాలని పరిశోధకుడు భావించాడు. అందుకే చెట్టు మొదలును తవ్వుతున్న క్రమంలో మనిషికి సంబంధించిన అవశేషాలు లభించాయి. ఈ విషయం స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో అహ్మద్‌ జాడ అతడి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కనీసం ఇన్నేళ్ల తర్వాతనైనా తన అహ్మద్‌ గురించి తమకు నిజం తెలిసిందని అతడి సోదరి వ్యాఖ్యానించింది. ఈ విషయం బయటపడటానికి కారణమైన ఆ పరిశోధకుడికి ధన్యవాదాలు తెలిపింది.

మరిన్ని వార్తలు