రన్‌వే నుంచి నదిలోకి..

5 May, 2019 05:24 IST|Sakshi
నదిలోకి దూసుకొచ్చిన విమానం

జాక్సన్‌విల్లే: అమెరికాలో పెను విమాన ప్రమాదం తప్పింది. క్యూబా దేశం నుంచి అమెరికాలోని ఉత్తర ఫ్లోరిడాకు 143 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఓ చార్టర్‌ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయి వేగంతో దూసుకెళ్తూ రన్‌వే నుంచి అదుపుతప్పి ఆ పక్కనే ఉన్న సెయింట్‌ జాన్స్‌ నదిలోకి దూసుకెళ్లింది. అయితే శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. క్యూబాలోని గ్వాంటనమో బే నావల్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరిన బోయింగ్‌–737 విమానం అమెరికాలోని జాక్సన్‌విల్లే నావల్‌ స్టేషన్‌లో ల్యాండ్‌ అవుతుండగా ఈ ఘటన జరిగింది.

ఘటన జరిగినపుడు విమానంలో 136 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు. స్వల్పగాయాలైన 21 మందిని ఆస్పత్రికి తరలించారు. ఈ విమానంపై మియామీ ఎయిర్‌ ఇంటర్నేషనల్‌ లోగో ఉన్న ఫొటోను అధికారులు పోస్ట్‌ చేశారు. అయితే దీనిపై మియామీ స్పందించలేదు. ‘ఇది నిజంగా ఒక అద్భుతం. నదిలో నుంచి విమానాన్ని బయటికి తీయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం’ అని ఎన్‌ఏఎస్‌ జాక్సన్‌విల్లే కమాండింగ్‌ అధికారి కెప్టెన్‌ మేఖేల్‌ కాన్నర్‌ అన్నారు. విమానంలోని ఇంధనం నదిలోకి లీక్‌ అవ్వకుండా చూసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు