నేలకు దిగిన బోయింగ్‌ ఆశలు!

23 Dec, 2019 02:24 IST|Sakshi
న్యూమెక్సికో ఎడారిలో సురక్షితంగా ల్యాండైన స్టార్‌లైనర్‌ క్రూ క్యాప్సూ్యల్‌

అంతరిక్ష కేందాన్ని అందుకోకుండానే వెనుదిరిగిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌

కేప్‌ కెనవెరాల్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో నింగిలోకి దూసుకెళ్లిన బోయింగ్‌ కంపెనీ స్టార్‌లైనర్‌ క్రూ క్యాప్సూ్యల్‌ డమ్మీ అంతరిక్ష నౌక ఆదివారం న్యూమెక్సికోలోని ఎడారిలో సురక్షితంగా ల్యాండైంది. అయితే అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లకుండానే వెనుదిరిగి రావడంతో వచ్చే ఏడాది వ్యోమగాములతో చేయాల్సిన ప్రయోగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కిందకు దిగే క్రమంలో మూడు పారాచ్యూట్‌లు తెరుచుకోవడంతోపాటు ఎయిర్‌బ్యాగులు కూడా సరిగా పనిచేయడం వల్ల సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. వారం రోజులకు పైగా అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సిన నౌక.. కేవలం ప్రయోగించిన రెండు రోజులకే వెనుదిరగాల్సి వచ్చింది.

సురక్షిత ల్యాండింగ్‌ కావడం కొంతమేర సానుకూల అంశం. నాసా భాగస్వామ్యంతో నిర్మించిన స్టార్‌లైనర్‌ క్యాప్సూ్యల్‌ డమ్మీ అంతరిక్ష నౌకను మానవరహితంగా ఫ్లోరిడాలోని కేప్‌ కెనవెరాల్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శుక్రవారం ప్రయోగించారు. అట్లాస్‌–5 రాకెట్‌తో నింగిలోకి ఎగిరిన స్టార్‌లైనర్‌ 15 నిమిషాలకు దాని నుంచి వేరుపడింది. అయితే ఆ తర్వాత కొన్ని నిమిషాలకు తమ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్య నుంచి దారి తప్పిందంటూ బోయింగ్‌ ట్వీట్‌ చేసింది. దాన్ని సరైన కక్ష్యలోకి తెచ్చే ప్రయత్నాల్లో తాము నిమగ్నమైనట్లు తెలిపింది. వచ్చే ఏడాది వ్యోమగాములను స్టార్‌లైనర్‌ ద్వారా అంతరిక్ష యాత్రకు పంపాలని సంకల్పించిన క్రమంలో తాజా వైఫల్యం తీవ్ర ఆందోళన కలిగించే అంశం కానుంది. వచ్చే ఏడాది స్టార్‌లైనర్‌ కాప్సూ్యల్‌లో ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు బోయింగ్‌ సన్నాహాలు చేస్తోంది.
 

>
మరిన్ని వార్తలు