‘ఎగిరే’ టెలిస్కోపు!

7 Jul, 2014 03:18 IST|Sakshi
‘ఎగిరే’ టెలిస్కోపు!

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ఈ బోయింగ్ 747 జెట్ విమానం ఎగిరే టెలిస్కోపులాంటిది. దీనిలో అమర్చిన 17 టన్నుల బరువు, 8 అడుగుల సైజున్న ఓ టెలిస్కోపు అంతరిక్షంపై నిఘా వేసి.. నక్షత్రాల పుట్టుకకు సంబంధించిన రహస్యాలను అన్వేషించనుంది. అధికారికంగా ‘సోఫియా(స్ట్రాటోస్పెరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రారెడ్ ఆస్ట్రోనమీ)’గా నామకరణం చేసిన ఈ విమానం భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో తొలి పొర ట్రోపోస్ఫియర్ అంచులదాకా ప్రయాణించగలదు. అందుకు తగ్గట్టుగా దీనిలో అధునాతన మార్పులు చేశారు.
 
అంతరిక్షం నుంచి వచ్చే కాంతిపై వాతావరణంలోని నీటి ఆవిరి, ఏరోసాల్స్ ప్రభావం ఉంటుంది కాబట్టి.. భూమిపై నుంచి అబ్జర్వేటరీలు దానిని స్పష్టంగా చూడలేవు. అందుకే నక్షత్రాల నుంచి వచ్చే కాంతిని ట్రోపోస్ఫియర్ చివరి నుంచి మరింత స్పష్టంగా ఫొటోలు తీయవచ్చని తొలిసారిగా ఇలా ఈ పరారుణ టెలిస్కోపును విమానంలో అమర్చి పంపుతున్నారు. ఈ విమానాన్ని అత్యధిక ఎత్తులో, వేగంగా ప్రయాణించేలా బోయింగ్ కంపెనీ 1970లలో రూపొందించింది.  ఇది 12 గంటలకు పైగా నిరంతరాయంగా ఎగరగలదు. ప్రస్తుతం జర్మనీలో తుది మెరుగులు దిద్దుకుంటున్న సోఫియా వచ్చే ఏడాది వంద సార్లు నింగికి ఎగరనుంది. చుక్కల గుట్టు విప్పేపనిలో 20 ఏళ్లపాటు సేవలు అందించనుంది.

మరిన్ని వార్తలు