పాకిస్తాన్‌లో పేలుడు.. 16 మంది మృతి

12 Apr, 2019 13:33 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా పట్టణంలో బాంబు పేలిన ఘటనలో 16 మంది మృతి చెందగా.. 30 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కూరగాయల మార్కెట్‌లో ఘటన జరిగినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. బాంబు దాటికి కొన్ని భవనాలు కూలిపోయానని.. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కాగా బెలూచిస్తాన్‌లోని క్వెట్టాలో నివసించే మైనార్టీ వర్గం హజారా(షియా ముస్లింలు)లే లక్ష్యంగా ముష్కరులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పక్కాగా రిక్కీ నిర్వహించి జనసమ్మర్థం ఎక్కువగా ఉండే చోట ఐఈడీ పేలేలా ప్రణాళిక రచించారని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇంతవరకు ఏ గ్రూప్‌ కూడా దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు. ఇక పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇందుకు కారణమైన వారిని గుర్తించి త్వరితగతిన నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు