‘వాళ్ల కోసం నిబంధనలు ఉల్లంఘించాం’

15 Oct, 2019 08:53 IST|Sakshi

లండన్‌ : ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు రచయిత్రులకు అరుదైన గౌరవం దక్కింది. మహిళలకు సంబంధించిన అంశాలే ప్రధాన కథావస్తువుగా ఎంచుకున్న మార్గరెట్‌ ఎట్‌వుడ్‌, బెర్నార్డైన్‌ ఎవరిస్టో సంయుక్తంగా బుకర్‌ ప్రైజ్‌-2019ను సొంతం చేసుకున్నారు. 1984లో లింగసమానత్వంపై తాను రాసిన ‘ద హ్యాండ్‌మేడ్‌’ టేల్‌తో ప్రాచుర్యం పొందిన కెనడియన్ రచయిత్రి ఎట్‌వుడ్‌... తన తాజా నవల ‘ద టెస్టామెంట్‌’కు గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకోగా.... ‘గర్ల్‌, వుమన్‌, అదర్‌’ నవలతో బుకర్‌ ప్రైజ్‌ సాధించిన తొలి నల్లజాతి మహిళగా ఎవరిస్టో నిలిచారు. కాగా కాల్పనిక సాహిత్యానికి ఇచ్చే ఈ అత్యున్నత అవార్డు చరిత్ర(1969లో ప్రారంభమైంది)లో 1992 తర్వాత తొలిసారి ఇద్దరు విజేతలను ప్రకటించడం విశేషం. ఈ విషయం గురించి న్యాయ నిర్ణేతల మండలి చైర్మన్‌ పీటర్‌ ఫ్లోరెన్స్‌ మాట్లాడుతూ.. దాదాపు ఐదు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ‘మేము తీసుకున్నది నిబంధనలను ఉల్లంఘించే నిర్ణయం. వారి గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే... అంత ఎక్కువగా వారితో ప్రేమలో పడిపోతున్నాం. కాబట్టి వారిద్దరూ గెలవాలని కోరుకున్నాం’ అని ఎట్‌వుడ్‌, ఎవరిస్టోను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇక ఎవరిస్టోతో కలిసి సంయుక్తంగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం తనకు ఆనందంగా ఉందని 79ఏళ్ల ఎట్‌వుడ్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘ నేను తొందరగా ముసలిదాన్ని అయ్యానని అనిపిస్తోంది. కాబట్టి నాకు ఎవరి అటెన్షన్‌ అక్కర్లేదు. అయితే నీకు అవార్డు రావడం వల్ల అటెన్షన్‌ మొత్తం నీ మీదే ఉంటుంది(తన కంటే వయసులో చిన్నవారనే ఉద్దేశంతో). నేను ఒక్కదాన్నే అవార్డు తీసుకుని ఉంటే కాస్త ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ గిల్‌‍్డహాల్‌లో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఎవరిస్టోతో ఎట్‌వుడ్‌ సరాదాగా వ్యాఖ్యానించారు. కాగా ఆమె రాసిన ‘ద హ్యాండ్‌మేడ్స్‌ టేల్‌’ కూడా 1986లో బుకర్‌ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్‌ అయింది.

మేము రాయకపోతే...
బుకర్‌ ప్రైజ్‌ సొంతం చేసుకున్న సందర్భంగా ఎవరిస్టో(60) మాట్లాడుతూ.. ‘నల్లజాతి బ్రిటీష్‌ మహిళలమైన మా గురించి మేము రాయకపోతే ఇంకెవరూ సాహిత్యంలో మాకు చోటివ్వరు. లెజెండ్‌, దయా హృదయురాలైన మార్గరెట్‌ ఎట్‌వుడ్‌తో కలిసి ఈ అవార్డు పంచుకోవడం అసమానమైనది’ అని ఉద్వేగానికి గురయ్యారు. నల్లజాతికి చెందిన భిన్న మనస్తత్వాలు కలిగిన పన్నెండు మంది మహిళలు తమ కుటుంబం, స్నేహితులు, ప్రేమికుల గురించి పంచుకునే భావాలే.. ‘గర్ల్‌, వుమన్‌, అదర్‌’ నవల సమాహారం. కాగా భారత్‌కు చెందిన సల్మాన్‌ రష్దీ నవల ‘క్విచోటే’ కూడా బుకర్‌ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్‌ అయిన ఆరు నవలల్లో ఒకటిగా నిలిచింది. సమకాలీన అమెరికాలోని క్రేజీనెస్‌ను రష్దీ తన నవలలో అద్భుతంగా వర్ణించారని జ్యూరీ పేర్కొంది. ఇక ముంబైలో జన్మించిన రష్దీ.. నవలలు ప్రతిష్టాత్మక అవార్డు తుదిజాబితాలో చోటు దక్కించుకోవడం ఇది ఐదోసారి. 1981లో ఆయన రాసిన ‘మిడ్‌నైట్స్‌ చిల్డ్రన్‌’ నవలకు బుకర్‌ ప్రైజ్‌ లభించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు