కొత్త పంచాయితీ ఎత్తుకున్న చైనా

5 Jul, 2020 10:25 IST|Sakshi

భూటాన్‌తో సరిహద్దు వివాదం ఉందంటూ ప్రకటన 

తూర్పు ప్రాంతంలో పేచీపై తొలిసారి స్పందన

భారత్‌ జోక్యం వద్దంటూ సూచన

న్యూఢిల్లీ: కయ్యానికి కాలు దువ్వే డ్రాగన్‌ కంట్రీ మరోసారి భూటాన్‌తో సరిహద్దు పంచాయితీ ఉందంటూ కొత్త రాగం అందుకుంది. పొరుగునున్న భూటాన్‌తో తూర్పు ప్రాంతంలో సరిహద్దు వివాదాలున్నాయని చైనా తొలిసారి అధికారికంగా ప్రకటించింది. చాలా ఏళ్లుగా నెలకొన్న ఈ వివాదం ఇంకా ముగియలేదని తెలిపింది. చైనా, భూటాన్‌ సరిహద్దుల్లోని తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో నెలకొన్న వివాదాల్లో.. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో వివాదాలు సమసిపోయాయని, తూర్పు ప్రాంతంలో వివాదం అలాగే ఉందని చైనా శనివారం వెల్లడించింది. అయితే, భూటాన్‌తో ఉన్న సరిహద్దు వివాదంలో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా భారత్‌ను ఉద్దేశించి చైనా స్పష్టమైన సూచన చేసింది. కాగా, చైనా చెప్తున్న తూర్పు ప్రాంతం అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులో ఉన్నందున భారత్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
(చదవండి: లవ్‌ ఇండియా : ట్రంప్‌ వైరల్‌ ట్వీట్‌)

ఇదిలాఉండగా.. 1984 నుంచి 2016 వరకు చైనా భూటాన్‌ మధ్య 24 సార్లు చర్చలు జరిగాయి. ఇవన్నీ ఇరు దేశాల మద్య ఉన్న పశ్చిమ, మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినవేనని భూటాన్‌ పార్లమెంట్‌ డాటా ప్రకారం తెలుస్తోంది. రెండు దేశాల మధ్య ఎన్నోసార్లు చర్చలు జరిగినప్పటికీ.. తూర్పు సరిహద్దు ప్రాంతంపై ఎలాంటి వివాదాలు తెరపైకి రాలేదని భూటాన్‌ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక చైనా తాజా ప్రకటనపై భారత్‌ ఇంకా స్పందించలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌ పర్యటన నేపథ్యంలోనే డ్రాగన్‌ దేశం తాజా వివాదాన్ని లేవనెత్తిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో భూటాన్‌తో ఉన్న తూర్పు ప్రాంత వివాదం కొత్తదేమీ కాదని, ఏళ్లుగా నలుగుతోందని చైనా తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటోంది.
(చదవండి: రాయని డైరీ: జిన్‌పింగ్‌ (చైనా అధ్యక్షుడు))

మరిన్ని వార్తలు