ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లకు గుడ్‌ బై

10 Mar, 2018 17:38 IST|Sakshi

బోస్టన్‌ : సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌ సైట్లు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లకు ఆదరణ గణనీయంగా తగ్గిపోతోంది. మెజార్టీ యువత వాటికి దూరంగా ఉండేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారంట. ఈ క్రమంలో చాలా మంది వాటికి గుడ్‌ బై కూడా చెబుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది.

బోస్టన్‌ కు చెందిన మార్కెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ సంస్థ ఓరిజిన్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి మందిపై అధ్యయనం చేసింది. వీరంతా 18 నుంచి 24 ఏళ్ల లోపు వాళ్లే(భారత్‌ నుంచి 40 మంది పాల్గొన్నారు). గత కొంత కాలంగా వీరంతా సోషల్‌ మీడియాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారంట. 50 శాతం మంది పూర్తిగా ఉపశమనం పొందేందుకు యత్నిస్తుండగా.. 34 శాతం మంది తమ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి యాప్‌లను ఇప్పటికే తొలగించేశారు.

మొత్తం 41 శాతం మంది సోషల్‌ మీడియా ద్వారా తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఛాటింగ్‌ కంటే ఆన్‌ లైన్‌ షాపింగ్‌ కే వారు ఎక్కువ సమయం కేటాయించినట్లు చెప్పటం విశేషం. రాను రాను సోషల్‌ మీడియాపై యువతకు ఆసక్తి తగ్గిపోతోందని.. వ్యక్తిగత విషయాలను షేర్‌ చేసుకోవటానికి కూడా ఆసక్తి చూపటం లేదని.. పైగా వాటి వల్ల ఎలాంటి లాభం ఉండట్లేదన్న నిర్ధారణకు వస్తున్నారని..  అందుకే వాటికి దూరమౌతున్నారనంటూ... సర్వే వివరాలను ఓరిజిన్‌ సీఈవో మార్క్‌ డెన్విక్‌ వెల్లడించారు. 

డేటింగ్‌ యాప్‌ టిండర్‌ లాంటి వాటికి కూడా ఆదరణ తగ్గిపోతుండగా.. అమెరికాలో మాత్రం స్నాప్‌ ఛాట్‌కి ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని సర్వే వెల్లడించింది. 

మరిన్ని వార్తలు