బ్రిటన్‌ కొత్త వీసాకు తుదిమెరుగులు

10 Feb, 2020 04:00 IST|Sakshi

లండన్‌: ఈయూ నుంచి వైదొలగిన బ్రిటన్‌ బ్రెగ్జిట్‌ పాయింట్స్‌ బేస్డ్‌ వీసా, ఇమిగ్రేషన్‌ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన వ్యవహారాలకు ప్రధాని బోరిస్‌ జాన్సన్, హోంమంత్రి ప్రీతి పటేల్‌లు తుదిమెరుగులు దిద్దినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నిపుణులను భారత్‌ సహా ప్రపంచ నలుమూలల నుంచి రప్పించుకోవచ్చని ఆ దేశం భావిస్తోంది. గత వారం జరిగిన సమావేశంలో యూకే మైగ్రేషన్‌ అడ్వైజరీ కమిటీ సూచించిన సలహాలను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది.

ఇందులోనే కనీస వేతనాలు సంబంధించిన వివరాలున్నాయి. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా అందులో ఉన్నాయి. గురువారం మంత్రివర్గ విస్తరణ జరగనుండగా, శుక్రవారం వీసాల వ్యవహారానికి సంబంధించిన వివరాలను ప్రీతి పటేల్‌ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిపుణుల రంగంలో యూకే వీసాల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారు. గతేడాదిలో 56 వేలకు పైగా టైర్‌–2 వీసాలను యూకే ఇచ్చింది. బ్రెగ్జిట్‌ వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు