బోస్‌-ఐన్‌స్టీన్‌లు ఊహించినట్టుగానే అంతరిక్షంలో..

12 Jun, 2020 13:58 IST|Sakshi

పారిస్‌ : శతాబ్ధం కిందట భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్ర నాథ్ బోస్, జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌లు ఊహించిందే నిజమైంది. సాధారణంగా అణువులు సాలిడ్‌, లిక్విడ్‌, గ్యాస్‌, ప్లాస్మా స్థితుల్లో ఉంటాయి. అయితే వీటితోపాటూ ఐదో స్థితి కూడా ఉంటుందని బోస్‌-ఐన్‌స్టీన్‌లు ముందుగానే ఊహించారు. ఈ స్థితినే బోస్-ఐన్‌స్టీన్ కండెన్‌సేట్‌గా పిలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంతరిక్షంలో నాసా శాస్త్రవేత్తలు తొలిసారిగా ఐదవ స్థితి(బోస్-ఐన్‌స్టీన్ కండెన్‌సేట్‌)ని గమనించారు. దీంతో విశ్వానికి సంబంధించి అనేక చిక్కుముడులకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.   

ఒక నిర్దిష్ట మూలకం అణువులను సంపూర్ణ సున్నా ఉష్ణోగ్రతకు(0 కెల్విన్, -273.15 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు) చల్లార్చినప్పుడు ఒక పదార్ధం బోస్-ఐన్‌స్టీన్ కండెన్‌సేట్‌ల స్థితికి చేరుకుంటుందని వీరు అంచనా వేశారు. అటువంటి స్థితిలో, ఒక మూలకంలోని అణువులు క్వాంటం లక్షణాలను కలిగి ఉన్న ఒకే స్థితిలోకి మారుతాయి. ఈ సమయంలో అణువులు క్వాంటం లక్షణాలతో, ఒకే తరందైర్ఘ్యంతో ఒకే ఎన్‌టిటీగా మారిపోతాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా శాస్త్రవేత్తలు బీఈసీలపై జరుగుతున్న పరీక్షల ఫలితాలను గురువారం వెల్లడించారు.

కాగా, క్వాంటం సిద్దాతంత పరిణామ క్రమంలో ముఖ్యమైన ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టినందుకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఐన్‌స్టీన్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక సత్యేంద్రనాథ్ బోస్ 1920 లో క్వాంటం మెకానిక్స్‌లో బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్, బోస్-ఐన్‌స్టీన్ కండెన్‌సేట్ సిద్ధాంతానికి ఎనలేని కృషి చేశారు. ఆయన చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్‌ను 1954లో ప్రదానం చేసింది.

>
మరిన్ని వార్తలు