నీ స్కర్టు పొట్టిగా ఉంది.. ఇంటికి వెళ్లిపో..

22 Aug, 2019 13:31 IST|Sakshi

లండన్‌ : కంపెనీలలో డ్రెస్‌ కోడ్‌ పేరిట మహిళలపై వేధింపులు ఆగటంలేదు. పొట్టి దుస్తులు వేసుకుందన్న కారణంతో ఓ యువతిని ఆఫీసు నుంచి ఇంటికి పంపేసిన ఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని హాడ్డెస్‌డన్‌ హార్ట్‌ఫోర్డ్‌షెర్‌కు చెందిన లిల్లి క్యాటెల్‌ అనే యువతి గత కొద్ది నెలలుగా వార్‌విక్‌ ఎస్టేట్స్‌ అనే కంపెనీలో జూనియర్‌ క్రెడిట్‌ కార్డ్‌ కంట్రోలర్‌గా పనిచేస్తోంది. రోజూలానే గత బుధవారం కూడా ఆఫీసుకు వెళ్లింది. కార్యాలయంలో పనిచేసుకుంటుండగా హెచ్‌ఆర్‌ టీమ్‌ సభ్యురాలు ఒకరు ఆమెను పిలిచి ‘‘నీ స్కర్టు చాలా పొట్టిగా ఉంది. బాస్‌ నిన్ను ఇంటికి పంపమన్నారు. ఇంటికి పోయి డ్రెస్‌ మార్చుకుని రా’’ అని చెప్పి ఇంటికి పంపేసింది. అంతవరకు చక్కగా పనిచేసుకుంటున్న ఆమె మొదటిసారి ఇబ్బంది పడింది. అవమానకర పరిస్థితిలో ఇంటికి బయలుదేరింది.

దీనిపై లిల్లి మాట్లాడుతూ.. ‘ఆ రోజు నేను మాట్లాడటానికి ఓ రెండు నిమిషాలు సమయం ఇచ్చుంటే బాగుండేది. నన్నో చిన్నపిల్లలా భావించటం నాకేం నచ్చలేదు. అప్పుడే నిశ్చయించుకున్నాను! నాకు మాట్లాడే అవకాశం వచ్చే వరకు వెనక్కు తిరిగి వెళ్లేది లేదని. ఆ సంఘటన జరిగినప్పుడు నేనెంతో బాధపడ్డాను. ఆఫీసు బయట ఉన్న కారు దగ్గరకు చేరుకోగానే నాకు విపరీతమైన ఏడుపు వచ్చింది. కారులో కూర్చున్నప్పటికి ఏడుపు ఆపుకోలేకపోయాను. దారుణమైన విషయం ఏంటంటే.. అదే స్కర్టును నేను చాలా సార్లు వేసుకెళ్లాను. అన్ని రోజులు ఏమీ అనని వారు ఆ రోజే ఎందుకు నన్ను అవమానించారు. నాకు చాలా కోపం వచ్చింది. నా మీద కాస్త కూడా కనికరం చూపలేదు. చివరకు ఆ కార్యాలయంలో పనిచేయలేనని అనిపించింది. ఆఫీసుకు రావటంలేదని వాళ్లు నాకు నోటీసులు పంపిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసేశాను. యువతులు 40-50 ఏళ్ల మహిళల్లా దుస్తులు వేసుకోలేరు. ఆఫీసుల్లో డ్రెస్‌ కోడ్‌ పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇదే విషయమై ఆ కంపెనీ వాళ్లతో పోట్లాడాను కూడా’ అని తెలిపింది.

మరిన్ని వార్తలు