వైరల్‌: ఇద్దరితో సెల్ఫీనా అదృష్టమంటే ఇదే!

23 Sep, 2019 20:19 IST|Sakshi

హూస్టన్‌: దేశ ప్రధానితో ఓ సెల్ఫీ దిగాలని ఎవరైనా కోరుకుంటారు. ఇక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడితో ఓ ఫోటో దిగాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఓ కుర్రాడిని అనుకోని అదృష్టం అనూహ్యంగా వరించింది. భారత నరేంద్ర మోదీ, అమెరికా  అధ్యక్షుడు ట్రంప్‌తో  ఒకేసారి సెల్ఫీ దిగే అవకాశం వచ్చింది. హ్యూస్టన్‌లో జరిగిన హౌడీమోదీ కార్యక్రమానికి ట్రంప్‌, మోదీ హాజరైన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరికీ ఆహ్వానం పలికేందుకు కొంతమంది ప్రవాస భారతీయ బాలికలు అక్కడ ఉన్నారు. వీరితో పాటు ఓ​ బాలుడు కూడా వారితో కలిసి స్వాగతం పలికాడు. రెండు అగ్రరాజ్యాల అధినేతలను ఒక్కసారే ప్రత్యక్షంగా చూసేసరికి అతడికి ఆనందం అంతపట్టలేదు. ఇక ఆగలేక, ధైర్యం తెచ్చుకుని ట్రంప్‌ను ఓ సెల్ఫీ అడిగాడు ఆ పిల్లవాడు.  అనుకోకుండా ఓకే అన్న ట్రంప్‌ వెంట ఉన్న మోదీని కూడా పిలిచి.. ఫోటోకి ఓ స్టిల్‌ ఇవ్వు అంటూ సైగ చేశాడు. దీంతో ఇద్దరినీ తన ఫోన్‌లో బందించాడు. అయితే ఈ తతంగమంతా దగ్గరలోని ఓ కెమెరాలో రికార్డయింది.



అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం దీనిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కొద్ది సమయానికే వైరల్‌గా మారిన ఈ వీడియోకి విపరీతమైన స్పందన, కామెంట్లు వస్తున్నాయి. ఆ బాలుడు చాలా అదృష్టవంతుడంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. హౌడీ మోదీ కార్యక్రమానికి వేలాది మంది భారతీయులు తరలివచ్చిన విషయం తెలిసిందే. కిక్కిరిసిపోయిన జన సందోహంతో ఆదివారం ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో పండుగ వాతావరణం కనిపించింది. భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డోళ్ల మోతలు, మోదీ, మోదీ అనే నినాదాలు, కేకలతో ఎన్‌ఆర్‌జీ స్టేడియం హోరెత్తిపోయింది.

మరిన్ని వార్తలు