వైరల్‌ అవుతోన్న బుజ్జిగాళ్ల ఫొటో!

29 Aug, 2019 11:19 IST|Sakshi

హాయిగా సెలవులు గడిపిన తర్వాత మళ్లీ స్కూలుకు వెళ్లాలంటే ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక ఈ విషయంలో చిన్న పిల్లల అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతవరకు ఎంచక్కా బామ్మాతాతయ్యలు, అమ్మానాన్నాలతో సరదాగా గడిపిన చిన్నారులు చాలా మంది తిరిగి పాఠశాలకు వెళ్లాలంటే ఏడుపు లంకించుకోవడం సహజమే. అమెరికాకు చెందిన కానర్‌ అనే ఎనిమిదేళ్ల పిల్లాడు కూడా ఇలాగే స్కూలుకు వెళ్లే క్రమంలో ఏడుస్తూ ఓ చోట నిలబడిపోయాడు. పైగా అతడు ఆటిజం విద్యార్థి. తరగతి గదిలోకి వెళ్లలేక బాధ పడుతున్న అతడికి తోటి విద్యార్థి క్రిస్టియన్‌ మూరే అండగా నిలబడ్డాడు. కానర్‌ చేతిని ఆత్మీయంగా తన చేతుల్లోకి తీసుకుని లోపలికి తీసుకువెళ్లాడు.

ఈ విషయం గురించి చెబుతూ..‘ నా కొడుకు పట్ల నాకెంతో గర్వంగా ఉంది. ఓ మూలన ఏడుస్తున్న చిన్నారిని తను ఓదార్చాడు. తన చేయిని పట్టుకుని స్కూళ్లోకి తీసుకువెళ్లాడు. ఇలాంటి కొడుకును కన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. తనది విశాలమైన హృదయం. స్కూళ్లో మొదటిరోజు తను ఈవిధంగా ప్రారంభించాడు’ అంటూ ఇందుకు సంబంధించిన ఫొటోను క్రిస్టియన్‌ తల్లి కర్టనీ మూరే ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ బుజ్జిగాళ్ల ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో.. ‘ఎంత గొప్ప మనసురా నీది బుడ్డోడా. ఎదుటి వారి పరిస్థితిని అర్థం చేసుకున్న నీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక తన కొడుకును స్కూళ్లో దిగబెట్టేటపుడు బాగానే ఉన్నాడని.. తాను అక్కడి నుంచి వెళ్లిన తర్వాత క్రిస్టియన్‌ తనకు ఓదార్పునిచ్చాడని కానర్‌ తల్లి చెప్పుకొచ్చారు. ఆటిజం కారణంగా తన చిన్నారి ఎవరితోనూ కలవలేడని.. అతడికి స్నేహితులు కూడా తక్కువేనన్నారు. అయితే క్రిస్టియన్‌ మాత్రం అందరిలా కాకుండా తానే ముందుకొచ్చి కానర్‌తో స్నేహం చేశాడని..ఇప్పుడు వాళ్లిద్దరు ప్రాణ స్నేహితులు అయిపోయారని హర్షం వ్యక్తం చేశారు. కానర్‌- క్రిస్టియన్‌ల ఫొటోలు టీవీలో చూసినపుడు కుమారుడి పరిస్థితి చూసి తన భర్త కన్నీళ్లు ఆపుకోలేక పోయాడని చెప్పారు. అదేవిధంగా చిన్న వయస్సులోనే క్రిస్టియన్‌ మంచి స్వభావాన్ని అలవరచుకున్నాడని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు