బెస్ట్‌ ఫొటోషూట్‌: థ్యాంక్యూ మమ్మీ!!

16 Sep, 2019 10:50 IST|Sakshi

కవలల పుట్టినరోజుకు క్యాన్సర్‌తో బాధ పడుతున్న తల్లి గిఫ్ట్‌

వినూత్నమైన ఫొటోషూట్‌తో తన కవలల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపింది ఓ తల్లి. పిల్లలు ఇష్టపడే రీతిలో ఫొటోలు తీసి... చిరకాలం తమ ఆల్బమ్‌లో నిలిచిపోయేలా తన ఫొటోగ్రఫీతో మ్యాజిక్‌ చేసింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న తనకు ఇకపై పిల్లల వేడుకలు చేసే అవకాశం వస్తుందోలేననే బెంగ కాస్తైనా తీరిందని ఉద్వేగానికి గురైంది. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని.. అయితే తాను ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చినా ఫొటోల తాలూకు ఙ్ఞాపకాలు పిల్లల మదిలో కలకాలం నిలిచి ఉంటాయని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ‘వాళ్ల ఐదో పుట్టినరోజు వరకు బతికి ఉంటాననుకోలేదు. కానీ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు’ అని ఉద్వేగానికి లోనైంది. వివరాలు... అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ రేచల్‌ పర్మన్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్దమ్మాయి తర్వాత కవలలు ఎలిజా, ఎమిలీలు జన్మించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే తాను క్యాన్సర్‌ బారిన విషయం రేచల్‌కు తెలిసింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె..కొన్ని రోజుల క్రితం తన కవలల ఐదో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఫొటోషూట్‌ నిర్వహించింది.

ఇందులో భాగంగా యానిమేషన్‌ సినిమాల ఫ్యాన్‌ అయిన ఎలీజా...‘అప్‌’ మూవీ థీమ్‌ను ఎంచుకోగా... తనకు గుర్రంతో ఫొటోలు దిగాలని ఉందని ఎమిలీ తల్లిని కోరింది. ఈ క్రమంలో ఎలీజా ముత్తాత-అవ్వ అప్‌ మూవీలోని కార్ల్‌, ఎల్లీలుగా ముస్తాబై మునిమనవడితో ఫొటోలకు ఫోజిచ్చారు. ఇక ఎమిలీ కూడా తెల్ల గుర్రంపై ఎక్కి తన ముచ్చటను తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రేచల్‌ మూడు వారాల క్రితం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. తాము చూసిన బెస్ట్‌ ఫొటోల్లో ఇవే అత్యుత్తమైనవి అంటూ చిన్నారుల ఫొటోలకు నెటిజన్లు లైకులు కొడుతున్నారు.

మరిన్ని వార్తలు