అయస్కాంతాలతో అనారోగ్యం పాలయ్యాడు!

17 Nov, 2018 11:33 IST|Sakshi

ఉటా : పిల్లలు బొమ్మలతో ఆడుకోవడమంటే చాలా ఇష్టపడుతారు. అందులో వైవిధ్యమైన బొమ్మలంటే వారికి మరింత సంతోషం. వాటి కోసం కొట్లాడుతారు. మారం చేస్తారు. చివరకు కావాల్సిన బొమ్మలను కొనిపించుకుంటారు. అయితే కొన్నిసార్లు అవే బొమ్మలు వారి అనారోగ్యానికి కారణం అవుతాయి. ఈ బొమ్మల విషయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఒక్కోసారి ఏదో తీట పనిచేసి ఇబ్బందులు తెస్తుంటారు. ఇలానే అమెరికా, ఉటాలోని సాండీకి చెందిన మికా అర్విడ్సన్‌ అనే ఆరేళ్ల కుర్రాడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

తన సోదరుడి బొమ్మను నోట్లో దాచుకునే ప్రయత్నం చేసి తెలియకుండానే మింగేశాడు. దీంతో అనారోగ్యానికి గురైన అతను వాంతులు చేసుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అత్యవసర శస్త్ర చికిత్స చేసిన వైద్యులు  మికా కడుపులో బొమ్మకు సంబంధించిన 14 చిన్న అయస్కాంతాలను గుర్తించి బయటకు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంకా మికా ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని అతని తల్లిదండ్రులు తెలిపారు.   

మరిన్ని వార్తలు