స్ప్రే వాసనకి.. కోమాలోంచి బయటకు

28 May, 2019 20:58 IST|Sakshi

లండన్‌: ‘ఒక వ్యక్తి కోమాలో ఉంటాడు... అప్పుడు డాక్టర్‌ సదరు రోగి బంధువులకు తనకు ఇష్టమైన పాటలు పాడడం, కొన్ని సంఘటనలను వినిపించడం లాంటివి చేయండని చెబుతారు. దాంతో రోగి కోమాలో నుంచి బయటకు వస్తాడు’. ఇలాంటివి మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. అయితే నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటనే ఒకటి ఇంగ్లండ్‌లోని కుంబ్రియా ప్రాంతంలో జరిగింది. 

కెపాపర్ క్రూజ్ (13) అనే బాలుడు కొన్ని రోజుల క్రితం చలికి గడ్డకట్టి ఉన్న నదిపై నడుస్తూ నీటిలో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత క్రూజ్‌ని బయటకు తీశారు. అయితే అప్పటికే అతను చనిపోయాడని అంతా భావించారు. కానీ గుండె కొట్టుకోవడాన్ని గమనించిన వైద్యులు అతడు కోమాలోకి వెళ్లినట్లు ధ్రువీకరించారు. దాదాపు 21 రోజులపాటు క్రూజ్‌ని కోమాలో నుంచి బయటకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో క్రూజ్ ఇంట్లో స్నానానికి ఉపయోగించే సోప్స్‌తోపాటు డియోడ్రెంట్ ఇతరత్ర ఇష్టమైన వస్తువులను తీసుకురావాలని క్రూజ్‌ తల్లికి ఓ నర్సు సూచించింది. ఆమె సూచనల మేరకు క్రూజ్ శరీరాన్ని శుభ్రం చేసిన తల్లి అతడికి ఇష్టమైన డియోడ్రెంట్‌ను స్ప్రే చేసింది. దీంతో క్రూజ్ వెంటనే కళ్లు తెరిచాడు. ఆ డియోడ్రెంట్ అంటే క్రూజ్‌కు చాలా ఇష్టమని, అదే అతడిలో కదలిక తీసుకువస్తుందని తాము అస్సలు ఊహించలేకపోయామని క్రూజ్‌ తల్లి పేర్కొంది. ఇది చాలా అరుదైన ఘటన అని వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు.

మరిన్ని వార్తలు