ట్రంప్పై బ్రాడ్ పిట్‌కు చిర్రెత్తుకొచ్చింది..

8 Sep, 2016 16:56 IST|Sakshi
ట్రంప్పై బ్రాడ్ పిట్‌కు చిర్రెత్తుకొచ్చింది..

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్‌కు అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై చిర్రెత్తుకొచ్చింది. ముఖ్యంగా ట్రంప్ వేర్పాటువాద ఆలోచనలపై ఈ ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ మండిపడ్డారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అసలు ట్రంప్ ఏమనుకుంటున్నారు. మన దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇది ఎక్కడికి వెళుతోంది? అంటూ ట్రంప్ వేర్పాటువాద ప్రకటనలపై బ్రాడ్ పిట్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా ఇరుగుపొరుగుగా మారిపోయిందని, ఈ సమయంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలన్నారు.

ట్రంప్ విధానాలు ఒంటరి, వేర్పాటువాద ఆలోచనల వైపు ఉన్నాయన్నారు. ట్రంప్ మద్దతుదారులు అన్నింటికీ వ్యతిరేకంగా పోరాడుతున్నారని బ్రాడ్ పిట్ విమర్శించారు. యూరప్ నుంచి బ్రిటన్ విడిపోతుందని(బ్రెగ్జిట్) తాను అనుకోలేదని బ్రాడ్ పిట్ తెలిపారు. అందరినీ కలిపేది మంచిదని.. విడగొట్టేది చెడ్డదని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని తాను భావించడం లేదన్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో మెక్సికో సరిహద్దులో గోడ కడతానని, వలసదారులను వెనక్కి పంపుతానని, ముస్లింలను అమెరికాలోకి రానివ్వొద్దంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు