బ్రెజిల్‌ బేజార్‌

21 Jun, 2020 04:28 IST|Sakshi

10 లక్షలు దాటేసిన కరోనా కేసులు

అధ్యక్షుడు బోల్సనోరా నిర్లక్ష్యమే కొంప ముంచిందా?

కరోనాతో కొంపలేం మునిగిపోవని అనుకున్నారు అదో ఫ్లూ లాంటి జ్వరమేనని ప్రకటనలూ జారీ చేశారు లాక్‌డౌన్, భౌతికదూరం అవసరమే లేదన్నారు బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనోరా వైరస్‌ తీవ్రతను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఆ దేశం భారీ మూల్యం చెల్లిస్తోంది. కోవిడ్‌ కేసులు 10 లక్షలు దాటిపోతే, మృతులు 50 వేలకు చేరువలో ఉన్నారు.

అగ్రరాజ్యం అమెరికా తర్వాత కరోనా కోరల్లో చిక్కుకొని బ్రెజిల్‌ విలవిలలాడుతోంది. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనోరా ఏకపక్ష ధోరణితో వైరస్‌ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన సావో పాలో గవర్నర్‌ జాయ్‌ డోరియా  ‘దేశాన్ని పట్టిపీడిస్తున్నది కరోనా వైరస్‌ కాదు. బోల్సనోరా వైరస్‌’ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. లాక్‌డౌన్, భౌతిక దూరం వంటి చర్యల్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న బోల్సనోరా కొన్ని రాష్ట్రాల గవర్నర్లు అమలు చేసినా వారు రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారంటూ వైరస్‌ తీవ్రతని తగ్గించి చూపించే ప్రయత్నాలు చేశారు.

జూన్‌ మొదటి వారం నుంచి ప్రతీరోజూ సగటున రోజుకి 30వేల కొత్త కేసులతో మొత్తం కేసులు 10 లక్షలు దాటేశాయి. మృతుల సంఖ్య 50వేలకు చేరువలో ఉంది. అయినప్పటికీ అధ్యక్షుడు బోల్సనోరా వైరస్‌ కంటే లాక్‌డౌన్‌ అనేదే అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) అంచనాల ప్రకారం ఇకనైనా బ్రెజిల్‌ ప్రభుత్వం పకడ్బందీగా కోవిడ్‌ కట్టడి చర్యలు చేపట్టకపోతే దేశ ప్రజలు అసహనంతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది.

వైరస్‌ వ్యాప్తికి కారణాలివీ
► బ్రెజిల్‌లో ప్రతీ ఏటా ఫిబ్రవరిలో జరిగే కార్నివల్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం. అప్పటికే దేశంలో కరోనా జాడలున్నప్పటికీ ఉత్స వాల్ని ఘనంగా జరుపుకున్నారు. భారీగా ప్రజలు గుమికూడి సంబరాలు చేసుకున్నారు. కార్నివాల్‌ జరిగిన మర్నాడే ఫిబ్రవరి 26న దేశంలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత నాలుగు వారాల్లోనే కేసుల సంఖ్య లక్షకి చేరుకుంది.

► కరోనా సంక్షోభ పరిస్థితిని తట్టుకునే వైద్య సదుపాయాలు దేశంలో లేవు. ఐసీయూలు, ఆక్సిజన్‌ సిలండర్లకు తీవ్ర కొరత నెలకొని ఉంది. కొన్నేళ్లుగా ఆరోగ్యరంగానికి కేటాయింపులు సరిగా జరగడం లేదు. దేశంలో ఏకంగా 40 వేల మంది వైద్య సిబ్బంది కోవిడ్‌ బారినపడ్డారు. ఆరోగ్య రంగంలో మరో లక్ష మందికి కరోనా సోకుతుందనే అంచనాలున్నాయి. వీటన్నింటితో ప్రభుత్వ ఆస్పత్రులే పడకేశాయి. బోల్సనోరా ధోరణితో విసిగిపోయి మూడు నెలల్లోనే ఇద్దరు ఆరోగ్య మంత్రులు రాజీనామా చేశారు.

► దేశంలో కోవిడ్‌ పరీక్షలు సరిగా జరగడం లేదు. కరోనా కట్టడికి అన్ని దేశాలు అనుసరిస్తున్న ప్రధాన సూత్రం ‘ట్రేస్, టెస్ట్, ట్రీట్‌’ను బ్రెజిల్‌ ప్రభుత్వం పాటించడం లేదు. ప్రతీ లక్ష మందికి సగటున రోజుకు కేవలం 14 పరీక్షలు జరుగుతున్నాయి.

► దేశంలో నెలకొన్న భారీ ఆర్థిక అసమానతలు కరోనా కేసులను పెంచేస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కువగా కరోనా విస్తరించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకొనే స్థోమత కలిగిన వారు దేశ జనాభాలో 20 శాతం మాత్రమే ఉన్నారు. వారు వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

గణాంకాలన్నీ తప్పుడు తడకలు!
బ్రెజిల్‌ కరోనా గణాంకాలన్నీ దాస్తోందన్న అనుమానాలున్నాయి. కోవిడ్‌ కేసుల్ని ట్రాక్‌ చేసే జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ అధికారిక లెక్కల కంటే కేసులు 7 రెట్లు ఎక్కువగా నమోదై ఉండవచ్చునని చెబుతోంది. దీంతో జూన్‌ తొలివారంలో బ్రెజిల్‌ ప్రభుత్వం కొద్ది రోజుల పాటు అధికారిక గణాంకాలను విడుదల చేయడం మానేసింది. ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ ఇవ్వడం ప్రారంభించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు