కరోనా: ఫ్రాన్స్‌ను దాటేసిన బ్రెజిల్‌

14 May, 2020 11:53 IST|Sakshi

బ్రెసిలియా : బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు మరింత ఉదృతమవుతున్నాయి. బ్రెజిల్‌లో బుధవారం ఒక్కరోజే (24 గంటల్లో) 11,385 కేసులు నమోదవ్వడంతో పాటు 749 మంది మరణించారు. దీంతో బ్రెజిల్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,88,974కు చేరగా మృతుల సంఖ్య 13,149కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్యలో బ్రెజిల్‌ ప్రాన్స్‌ను దాటేసింది. కాగా ప్రాన్స్‌లో బుధవారం రాత్రి వరకు కరోనా కేసుల సంఖ్య 1,77,700లుగా ఉంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో బ్రెజిల్‌లో ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది.
(చైనాకు అక్ర‌మంగా మాస్కులు, పీపీఈ కిట్లు)

కరోనా నేపథ్యంలో ఇప్పటికే బ్రెజిల్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ మరికొన్ని వారాలు పొడిగించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు జైర్‌‌ బోల్సోనారొ ఆయా రాష్ట్రాల గవర్నర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా బుధవారం బ్రెజిల్‌ ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ దేశ ఆర్థిక పరిస్థితిని వివరించింది. బ్రెజిల్‌ ఎకానమీ రేటు 4.7 శాతానికి పడిపోయిందని, గత వందేళ్లలో ఇంతలా క్షణించడం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. కాగా నిర్బంధ చర్యలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలకు అదనపుగా వారానికి 20 బిలియన్లు ఖర్చు అవుతున్నట్లు మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే కొన్ని రోజులు ఆకలి సమస్య ఎక్కువయి ప్రజలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉందంటూ బొల్సొనారొ అభిప్రాయపడ్డారు.

కాగా బ్రెజిల్‌లో జిమ్‌, బ్యూటీ సెలూన్లను అత్యవసర సేవలుగా భావించి అనుమతులిస్తున్నట్లు బోల్సోనారొ తెలిపారు. వారి బిజినెస్‌ను అడ్డుకునే చర్యలకు పాల్పడితే లీగల్‌ యాక్షన్‌ తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే బ్రెజిల్‌లో అత్యధిక జనాభా కలిగిన సావో పాలలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. అధ్యక్షుడు బోల్సోనారో ఉత్తర్వులను పాటించలేమని గవర్నర్ జోవో డోరియా బుధవారం తేల్చిచెప్పారు. ఇప్పటివరకు ప్రపంచంలో బ్రెజిల్‌ కంటే అత్యధికంగా కరోనా కేసులు నమోదైనవిగా అమెరికా, స్పెయిన్‌, రష్యా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఇటలీలు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు