పిల్లలు లేని వారికి శుభవార్త!

6 Dec, 2018 04:58 IST|Sakshi

మరణించిన మహిళ గర్భసంచిని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్‌ చేసిన వైద్యులు

పారిస్‌: అమ్మదనానికి నోచుకోలేని స్త్రీలు అనుభవించే బాధ వర్ణనాతీతం. కొందరు స్త్రీలు పుట్టుకతోనే గర్భసంచి లేకుండా పుడితే.. మరికొందరు పెరుగుతున్న క్రమంలో గర్భసంచిని కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి వారికి గర్భసంచి మార్పిడి చేయించుకోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. గర్భసంచి దానం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, ప్రస్తుతం గర్భసంచి దానం చేసేందుకు సంబంధిత మహిళ కుటుంబసభ్యులకే అవకాశం ఉండటం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయితే బ్రెజిల్‌కు చెందిన వైద్యులు మరణించిన ఓ మహిళ గర్భసంచిని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు.

పుట్టుకతోనే గర్భసంచి లేదు..
బ్రెజిల్‌కు చెందిన 32 ఏళ్ల మహిళకు పుట్టుకతోనే గర్భసంచి లేదు. దీంతో ‘మేయర్‌ రోకీటాన్‌స్కీ కస్టర్‌ హైసర్‌’అనే సిండ్రోమ్‌కు గురైంది. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో 2016 సెప్టెంబర్‌లో గర్భసంచి మార్పిడి చికిత్స చేయాలని నిర్ణయించారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై మరణించిన ఓ 45 ఏళ్ల మహిళ గర్భసంచిని ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం సిద్ధం చేశారు. సుమారు 10 గంటలు శ్రమించి ఆమెకు గర్భసంచిని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. ఐదు నెలల తర్వాత ఆమె గర్భసంచిని పరీక్షించిన వైద్యులకు దుష్ప్రభావాలు కనిపించలేదు. నెలసరి కూడా రెగ్యులర్‌ అవుతుండటంతో సర్జరీ అయిన 7 నెలలకే ఆమె గర్భసంచిలోకి ఫలదీకరణం చెందిన అండాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం 10 రోజులకు ఆమె గర్భం ధరించినట్లు తెలిపారు. సిజేరియన్‌ ఆపరేషన్‌ ద్వారా 2017 డిసెంబర్‌లో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె నుంచి గర్భసంచిని తొలగించారు.

మరిన్ని వార్తలు