వైరల్‌ అయిన డ్రగ్‌ డాన్‌ ఆత్మహత్య

7 Aug, 2019 15:59 IST|Sakshi

రియోడిజెనిరో : తన కూతురులా వేషం వేసుకొని జైలు నుంచి పారిపోదామని చూసి ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయిన బ్రెజిల్‌ డ్రగ్‌ డాన్‌ క్లావినో డా సిల్వా మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జైలులోని తనగదిలో బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని చనిపోయాడని జైలు అధికారులు వెల్లడించారు. శనివారం అతను  జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి విఫలమమడంతో జాగ్రత్త పడిన అధికారులు అతన్ని హై సెక్యూరిటీ యూనిట్‌కు తరలించారు. 73 సంవత్సరాల కారాగారం విధించడం, ఇప్పటికే జైలు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అవడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్లావినో డా సిల్వా 2103లో జైలు నుంచి టన్నెల్‌ తవ్వి 27 మంది ఖైదీలతో పారిపోవడం కూడా సంచలనం అయింది. అయితే అతడు నెలరోజుల్లోనే అరెస్టు కావడంతో ప్రభుత్వం ఊపిరితీసుకుంది.
(చదవండి: ‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు!)

నేరముఠాలతో నిండిన బ్రెజిల్‌ జైళ్లు
అమెరికా, చైనాల తర్వాత బ్రెజిల్‌ జైళ్లలోనే ఎక్కువ మంది నేరస్తులు ఉన్నారు. జైళ్లలో జరిగే ఘర్షణలో నిత్యం వందల మంది చనిపోవడం అక్కడ సర్వసాధారణం. ప్రధానంగా మాఫియా గ్యాంగ్‌ల మధ్య గొడవలకు జైళ్లు కేంద్రాలయ్యాయనే విమర్శలు ఉన్నాయి. గత వారం పారా రాష్ట్రంలోని జైలులో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో 57 మంది ఖైదీలు మృతిచెందారు. కాగా బ్రెజిల్‌ ఇప్పటికే కొకైన్‌ మార్కెట్‌కు ప్రపంచ కేంద్రంగా మారి అప్రతిష్టను మూటకట్టుకుంది.

మరిన్ని వార్తలు