బ్రీతింగ్‌ వ్యాయామంతో వైరస్‌లకు చెక్‌!

24 Jun, 2020 16:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: యోగాలో భాగంగా లేదా ఇతర బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లో భాగంగాగానీ ముక్కుతో గాఢంగా గాలిని పీల్చుకొని నోటి నుంచి వదలడం ద్వారా పలు రకాల వైరస్‌ల బారి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకోవచ్చని నోబెల్‌ బహుమతి గ్రహీత, కాలిఫోర్నియా యూనివర్సిటీలో ‘ఎమిరిటస్‌ ఆఫ్‌ మాలిక్యులర్‌ అండ్‌ మెడికల్‌ ఫార్మాకాలోజీ, స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న లూయీ జే ఇగ్నారో తెలియజేశారు. 

ముక్కుతో గాలిని గాఢంగా పీల్చుకోవడం వల్ల గాలి ముక్కు రంధ్రాల గోడలకు తగలడంతో అక్కడ నైట్రిక్‌ ఆక్సైడ్‌ (ఎన్‌ఓ) అణువులు పుడతాయని, అవి గాలి ద్వారా ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడంతో అక్కడ రక్త ప్రసరణ ఎక్కువ జరుగుతుందని, అంతే కాకుండా రక్తంలో ఆక్సిజన్‌ శాతం ఎక్కువగా కలిసి ప్రవహించేందుకు కూడా ఈ నైట్రిక్‌ ఆక్సైడ్‌ అణువులు ఎంతగానో తోడ్పడుతాయని ఆయన చెప్పారు. అందుకే ఊపిరితిత్తుల సమస్యలున్న చిన్న పిల్లలకు ఇన్‌హేలర్‌ ద్వారా నైట్రిక్‌ ఆక్సైడ్‌ చికిత్సను అందిస్తారని ఆయన తెలిపారు. 
(చదవండి: హెర్బల్‌ టీ తో కరోనాకి చెక్‌!)

2003–04 సంవత్సరాల్లో సార్స్‌ వ్యాధి విజృంభించినప్పుడు శ్వాస పీల్చుకోలేక ఇబ్బంది పడుతున్న రోగులకు నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఇన్‌హేలర్‌లు మంచి ఫలితాలను ఇచ్చాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం కరోనా రోగులపై కూడా నైట్రిక్‌ ఆక్సైడ్‌ ప్రయోగ పరీక్షలు జరపుతున్నారని ఆయన తెలిపారు. ఈ శ్వాస సంబంధిత వ్యాయామం ద్వారా రక్తపోటు (బీపీ) కూడా అదుపులో ఉంటుందని ఆయన అన్నారు. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ ఎలా చేస్తే బాగుంటుందన్న ప్రశ్నకు ‘ఆక్సిజన్‌ ఎక్కువగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో అంటే, ఇంటి మేడ మీద లేదా పార్కుల్లో పది నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేయాలి. ఊపిరి తిత్తుల్లోకి గాలిని గాఢంగా పీల్చుకునేందుకు వీలైన భంగిమలో కూర్చొని చేయడం మంచిది’ అని ఆయన సూచించారు. 
(కరోనా: 56.71 శాతానికి పెరిగిన రికవరీ రేటు)

మరిన్ని వార్తలు