ఈ టెక్నిక్‌తో కరోనా వైరస్‌కు చెక్‌!

7 Apr, 2020 15:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ ఊపరితిత్తుల్లోకి లోతుగా గాలిని పీల్చుకోవాలి. 5 సెకండ్ల పాటు ఊపిరి బిగపట్టి మెల్లగా గాలిని బయటకు వదలాలి. ఇలా ఐదు సార్లు చేయాలి. ఆరోసారి గాలిని బయటకు వదులుతూ మూతికి అడ్డంగా ఏదైనా గుడ్డ పెట్టుకొని గట్టిగా దగ్గాలి. అప్పుడు ఊపిరితిత్తుల్లో  శ్లేష్మం ఉన్నట్లయితే అది బయటకు వస్తుంది. ఇలా రెండు సార్లు చేయలి. ఆ తర్వాత పరుపుపై దిండు వైపు ముఖం చేస్తూ బోర్లా పడుకొని పదిసార్లు దీర్ఘ శ్వాస తీసుకొని వదిలి వేయాలి. ఊపిరితిత్తులు మన ముందు వైపు ఛాతికి దగ్గరగా ఉండవు. వీపు వైపే దగ్గరగా ఉంటాయి. సహజంగా వీపు వైపు పడుకొని ఉంటాం కనుక ఊపిరితిత్తుల్లోకి గాలొచ్చే ద్వారాలు మూసుకుపోతాయి. అందుకని బోర్లా పడుకొని దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఇది కరోనా వైరస్‌ సోకిన వారే కాకుండా, వైరస్‌ సోకని వారు కూడా ముందు జాగ్రత్తగా చేయడం మంచిది’ అని లండన్‌ రోమ్‌ఫోర్డ్‌లోని క్వీన్స్‌ ఆస్పత్రి డాక్టర్‌ సర్ఫరాజ్‌ మున్సీ సూచించారు.(కరోనా కట్టడిపై ప్రధానికి సోనియా సూచనలు)

ఆయన చేసిన సూచనను తాను అక్షరాల పాటించడం ద్వారా కరోనా వైరస్‌ లక్షణాల నుంచి రెండు వారాలుగా బాధ పడుతున్న తాను పూర్తిగా కోలుకున్నానని ‘హారీ పాటర్‌’ సిరీస్‌ రచయిత జేకే రోలింగ్‌ చెప్పారు. తన భర్త అయిన డాక్టర్‌ నీల్‌ ముర్రే సూచన మేరకు డాక్టర్‌ సర్ఫరాజ్‌ మున్సీ సూచనలను పాటించానని, ప్రజల సౌకర్యార్థం ఆయన వీడియో పోస్ట్‌ చేస్తున్నానని రోలింగ్‌ ట్వీట్‌ చేశారు. దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడం లాంటి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ రోలింగ్‌ కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపించుకోలేదు. తగ్గిపోయింది కనుక ఇక అవసరం లేదని ఆమె చెప్పారు.(భారత్‌ అనేక ప్రయోజనాలు పొందింది: ట్రంప్‌)

ఇలా శ్వాసను పీల్చే టెక్నిక్‌ తన సహచర వైద్యులు సూ ఈలియట్‌దని, నర్సింగ్‌ డైరెక్టర్‌గా పని చేస్తోన్న ఆమె ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లో కరోనా బాధితులతో ఈ శ్వాస పక్రియను చేయిస్తున్నారని, ఇప్పుడు ఆమె సూచన మేరకే ఇంటి వద్ద ‘స్వీయ నిర్బంధం’లో ఉన్న కరోనా బాధితుల కోసం ఈ వీడియోను విడుదల చేశానని డాక్టర్‌ మున్షీ వివరించారు. శ్వాస పీల్చుకునే వ్యాయామం ద్వారా కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చని పలువురు యోగా గురువులు ఇప్పటికే సూచించిన విషయం తెల్సిందే.(కరోనా కట్టడికి కేజ్రీవాల్‌ 5 టీ ప్లాన్‌)

మరిన్ని వార్తలు