లేబర్ పార్టీలో ‘బ్రెగ్జిట్’ సంక్షోభం

27 Jun, 2016 11:37 IST|Sakshi
లేబర్ పార్టీలో ‘బ్రెగ్జిట్’ సంక్షోభం

పార్టీ అధ్యక్షుడు జెర్మీ కార్బిన్‌పై కీలక ఎంపీల తిరుగుబాటు
- విదేశాంగ కార్యదర్శిపై వేటేసిన అధ్యక్షుడు జెర్మీ కార్బిన్
- నిరసనగా ఆరుగురు షాడో కేబినెట్ మినిస్టర్ల రాజీనామా
- అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానంపై నేడు చర్చ.. రేపు రహస్య ఓటింగ్?
 
 లండన్: బ్రెగ్జిట్ రెఫరెండం  ప్రభావం యూకే ప్రతిపక్ష లేబర్ పార్టీపై పెను ప్రభావాన్ని చూపింది. పార్టీలో  తిరుగుబాటు మొదలైంది. దీంతో పార్టీ చీఫ్ జెర్మీ కార్బిన్.. తన విదేశాంగ కార్యదర్శిపై వేటు వేయగా.. తదనంతర పరిణామాలతో ఆరుగురు షాడో కేబినెట్ మినిస్టర్లు (ప్రభుత్వానికి సలహాలు, సూచనలిచ్చే ప్రతిపక్ష పార్టీ కీలక నేతలు) రాజీనామా చేశారు. కార్బిన్ నాయకత్వంపై నమ్మకం తగ్గిపోతోందని షాడో విదేశాంగ కార్యదర్శి హిల్లరీ బెన్ అనడంతోనే వేటు పడింది. ‘జెర్మీకి ఫోన్ చేసి.. మీరు పార్టీ నేతగా ఉన్నంతకాలం బ్రిటన్‌లో అధికారంలోకి వస్తామనే నమ్మకం లేదని చెప్పాను.

వచ్చే ఎన్నికలు చాలా కీలకమన్నాను. దీంతో నాపై వేటు వేశారు’ అని ఆమె తెలిపారు. ఒక వేళ కార్బిన్ అవిశ్వాసం ఎదుర్కొనేందుకు ఇష్టపడకపోతే రాజీనామాలు చేయండని తోటి షాడో కేబినెట్ సభ్యులతో చెప్పినట్లు వెల్లడించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే కార్బిన్ షాడో కేబినెట్ మంత్రులు హీదీ అలెగ్జాండర్ (ఆరోగ్యం), గ్లోరియా డీ పీరో (యూత్), అయాన్ ముర్రే (స్కాట్లాండ్ వ్యవహారాలు), సీమా మల్హోత్రా (ఆర్థిక, భారత సంతతి), లూసీ పావెల్ (టాన్స్‌పోర్టు), మెక్‌కార్తీ (పర్యావరణం) రాజీనామా చేశారు. మరికొందరు షాడో కార్యదర్శులు కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. రెఫరెండం ఫలితాన్ని ప్రభావితం చేయటంలో కార్బిన్ విఫలమయ్యారంటూ పలువురు లేబర్ పార్టీ ఎంపీలూ  విమర్శిస్తున్నారు. ఇద్దరు లేబర్ ఎంపీలు కార్బిన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పార్టీ చైర్మన్ క్రైయర్‌కు అందజేశారు. దీనిపై సోమవారం పార్టీ భేటీలో చర్చించనున్నారు. చైర్మన్ అంగీకరిస్తే.. మంగళవారం రహస్య బాలెట్‌లో కార్బిన్‌పై అవిశ్వాస పరీక్ష జరగనుంది. లేబర్ పార్టీలో మెజారిటీ సభ్యులు ఈయూలోనే ఉండాలని వాదించినా ఓటర్లలో ఈ అభిప్రాయాన్ని కలిగించటంలో అధిష్టానం విఫలమైందన్న  అభిప్రాయం వినిపిస్తోంది.

 మరోసారి రెఫరెండానికి భారీ మద్దతు
 బ్రెగ్జిట్‌పై మళ్లీ రెఫరెండం నిర్వహించాలంటూ మొదలైన ఉద్యమానికి భారీ మద్దతు లభిస్తోంది. 48 గంటల్లోనే  30 లక్షల మంది ఈ ఆన్‌లైన్ పిటిషన్‌కు మద్దతు తెలిపారని యూకే పార్లమెంటు వెబ్‌సైట్ పేర్కొంది. లక్షమంది సంతకాలు చేసిన ఏ పిటిషన్‌నైనా హౌజ్ ఆఫ్ కామన్స్‌లో చర్చిస్తారు. దీనికి 30 లక్షల మంది మద్దతుండటంతో.. మంగళవారం జరిగే హౌజ్ ఆఫ్ కామన్స్‌లో చర్చకు రావొచ్చు.

మరిన్ని వార్తలు