ఉగ్రవాదాన్ని పాక్తో ముడిపెట్టొద్దు

18 Oct, 2016 01:58 IST|Sakshi
ఉగ్రవాదాన్ని పాక్తో ముడిపెట్టొద్దు

బ్రిక్స్ సదస్సు అనంతరం మాట మార్చిన చైనా
పాక్ గొప్ప త్యాగాలు చేసిందంటూ ప్రశంసలు

 బీజింగ్: చైనా మరోసారి పాకిస్తాన్ పాటే పాడింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పోరుకు సిద్ధమంటూనే...మిత్రదేశం పాక్ విషయంలో మాత్రం మినహాయింపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఏ ఒక్క దేశంతోనే, మతంతోనే ముడిపెట్టవద్దంటూ పాక్‌కు  బాసటగా నిలిచే ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాక్ పుట్టిల్లంటూ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ చెప్పిన మరుసటి రోజే.. చైనా పాక్‌ను వెనకేసుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉగ్రవాదాన్ని పాక్‌తో ముడిపెట్టవద్దని, దానికి తాము వ్యతిరేకమంటూ పరోక్షంగా మనసులో మాట బయటపెట్టింది. పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేసే ప్రయత్నాల్లో భారత్ నిమగ్నమైన వేళ... పాక్ గొప్ప త్యాగాలు చేసిందంటూ ఆ దేశానికి అండగా నిలిచే ప్రయత్నాలు ప్రారంభించింది.

 దేశంతో, మతంతో ముడిపెట్టకండి: చైనా
గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ సోమవారం విలేకరుల సమావేశంలో స్పందించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి పుట్టిల్లు  అని మోదీ వ్యాఖ్యానించారని, పాకిస్తాన్‌కు మిత్ర దేశంగా...ఇది సరైందేనా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ... ఉగ్రవాదాన్ని ఏ దేశంతోనో, మతంతోనే ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తామంటూ సమాధానమిచ్చారు. ఓ వైపు పాక్‌ను వెనకేసుకొస్తూనే.. మరోవైపు ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న దేశాలు, సంస్థలపై అంతర్జాతీయ సమాజం పోరు సాగించాలని పిలుపునిచ్చారు.

‘చాలా కాలంగా ఇదే మా వైఖరి. అయితే అది ఏ రూపంలో ఉన్నా మేం వ్యతిరేకిస్తాం. ప్రపంచ దేశాల భద్రత, సుస్థిరత కోసం అంతర్జాతీయంగా ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని మేం భావిస్తున్నాం’ అని తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంటే దేశం, సంస్థ, వ్యక్తులు అని చూడకుండా... ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం, జాతీయ భద్రత, అభివృద్ధి కోసం పరస్పర సహకారంతో అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్నారు. ఉగ్రవాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన గోవా డిక్లరేషన్ సారాంశాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 పాక్ త్యాగాల్ని ప్రపంచం గుర్తించాలి
‘భారత్, పాక్.. రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే. అయితే ఉగ్రవాదంపై పోరులో పాక్ గొప్ప త్యాగాలు చేసింది. దీన్ని ప్రపంచం గుర్తించాల్సిన అవసరముంది’ అంటూ చైనా విదేశాంగ ప్రతినిధి పేర్కొనడం పాక్‌పై ఎంత ప్రేమ ఉందో చాటిచెప్పింది. భారత్, పాక్ తమ పొరుగు మిత్ర దేశాలని, ఆ రెండు దేశాలు శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటాయని భావిస్తున్నట్లు హువా తెలిపారు. చర్చలతోనే  సంబంధాలు మెరుగుపడతాయన్నారు.

భారత్‌లో ‘ఉగ్ర’ ఆజ్యమే పాక్ పని
చండీగఢ్: పాకిస్తాన్ వ్యవస్థ మొత్తం భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో నిమగ్నమైందని కేంద్ర హోం మ్రంతి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. దీంతో ఇతర దేశాలతో పోలిస్తే భారత్-పాక్ సరిహద్దు నిర్వహణ సవాలుగా మారిందన్నారు. చండీగఢ్‌లో జరుగుతున్న ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతీయ ఎడిటర్ల సదస్సులో రాజ్‌నాథ్ ప్రసంగించారు. పాముకు పాలు పోసి పెంచితే దాని కాటుకు బలికాక తప్పదని, పాక్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. 

ఉగ్రవాద వ్యతిరేక  పోరులో పాకిస్తాన్ ఉద్దేశం స్పష్టమైతే... పీవోకేలో ఉగ్రవాద వ్యతిరేక ప్రచారం కోసం భారత్ సాయం చేస్తుందని రాజ్‌నాథ్ చెప్పారు. పాక్ పోత్సాహ ఉగ్రవాదానికే వ్యతిరేకం తప్ప  పాక్ ప్రజలపై ఎలాంటి విద్వేష ప్రచారం చేయడం లేదన్నారు. ‘ఉగ్రవాదాన్ని పాక్ తమ దేశ విధానంగా మార్చుకుంది. అంతర్జాతీయంగా ఏకాకి అవుతోంది. ఎలాంటి మంచి చేయని అంశాలపై, ఆ దేశానికి కూడా ఉపయోగం లేని వాటిపై పాక్ ఎక్కువ నిమగ్నమైంది’ అని అన్నారు. ఈశాన్య ప్రాంతంలో చొరబాటు గ్రూపుల అంశాన్నీ ప్రస్తావించారు. హింస వదిలిపెట్టాలంటూ ఉగ్ర గ్రూపులతో చర్చలు జరిపామని, మొండిగా ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు