-

పెళ్లి కూతురుతో పూల ‘బామ్మలు’

18 Oct, 2019 17:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు సినిమాల్లో యువ రాణులు తమ చెలికత్తెలతో కలిసి పూల బుట్టలు పట్టుకొని పూదోటలకు వెళ్లి రావడం, గుళ్లూ గోపురాలు చుట్టి రావడం మనలో ఎక్కువ మంది చూసే ఉంటారు. మరి ఇలాంటి అనుభవం అమెరికాకు చెందిన లిండ్సే రాబీకి ఎక్కడ ఎదురయిందో తెలియదు గానీ, తన పెళ్లికి మాత్రం పూల బామలు కాకుండా పూల బామ్మలు కావాలని పంతం పట్టింది. అంటే తన నలుగురు బామ్మలు పూల బుట్టలు పట్టుకొని తన ముందు పూలు చల్లుకుంటూ నడుస్తుంటే పెళ్లి కూతురు దుస్తుల్లో ముస్తాబై తాను పెళ్లి పీటలపైకి నడిచి వస్తానంటూ తన మనోగతాన్ని పెళ్లి ఏర్పాట్లు చూసే పెద్దలకు చెప్పింది.

అంతే లిండ్సే నలుగురు బామ్మలకు ఒకే నీలి రంగుపై నీలి, తెలుపు, కాస్త నలుపు రంగు చుక్కలు కలిగిన దుస్తులను ఆగ మేఘాల మీద వెళ్లి కుట్టి తెప్పించారు. లిండ్సే ముత్తవ్వ (తల్లి తల్లికి తల్లీ) కథ్లీన్‌ బ్రౌన్, 72 ఏళ్ల బెట్టీ బ్రౌన్, 76 ఏళ్ల వాండా గ్రాంట్‌ (వారిలో ఒకరు తన తల్లికి తల్లి కాగా, మరొకరు తన తండ్రికి తండ్రి), ఇక పెళ్లి కుమారుడు ట్యానర్‌ రాబీ తల్లి జాయ్‌ రాబీలు ఆ ఒకే తీరు దుస్తులను ధరించి అట్టలతో చేసిన పూల బుట్టలను పట్టుకొని పెళ్లి కూతురు కోరిక మేరకు ఆమె ముందు నడుస్తూ, దారంటూ పూల చల్లుతూ పెళ్లి కూతరును పీటలపైకి ఆహ్వానించారు. బామ్మలకు కూడా మనుమరాలిని అలా ఆహ్వానించడం తెగ ముచ్చటేసింది.

బామ్మల పట్ల మనమరాలికున్న అనుబంధానికి ఈ వెంట్‌ నిదర్శనమని పెళ్లికి హాజరైన బంధువులు, మిత్రులు వేనోళ్ల ప్రశంసలు కురిపించారు. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని బెంటాన్‌ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న  ఈ ముచ్చటైన సంఘటనను ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్‌ నటాలీ కాహో వాటిని ‘ఇన్‌స్టాగ్రామ్‌’ బిజినెస్‌ పేజీలో పోస్ట్‌ చేయగా అవి వైరల్‌ అవుతున్నాయి. వాటిని చూస్తున్న యూజర్లు ఎవరికి వారు, ఇలాంటి పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని కలలుగంటున్నారు.

మరిన్ని వార్తలు