అద్దెకు తోడి పెళ్లికూతుళ్లు

16 Aug, 2016 14:25 IST|Sakshi
అద్దెకు తోడి పెళ్లికూతుళ్లు

ఏ దేశమైనా, ఎక్కడైనా యువతీ యువకులకు పెళ్లనేది జీవితాంతం గుర్తుండి పోవాల్సిన ఓ మధురజ్ఞాపకం. వాటిని చక్కగా జరిపించేందుకు ఎన్నో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. యువతీ యువకులకు పెళ్లి కుదర్చడం దగ్గరి నుంచి ఆహ్వాన పత్రికలు అందంగా ముద్రించడం, వాటిని బంధుమిత్రులకు పంపిణీ చేయడం, మ్యారేజ్ హాళ్లను బుక్ చేయడం, పెళ్లి పందిళ్లను అలంకరించడం, పెళ్లికి నగలు తయారు చేయించడం, దుస్తులు కుట్టించడం, పెళ్లి తంతును ఘనంగా నిర్వహించడం, విందు భోజనాలు, ఫొటో సెషన్లు నిర్వహించడం వరకు అన్ని వ్యవహారాలు చూసేందుకు నేడు ఆన్‌లైన్ సర్వీసులెన్నో అందుబాటులోకి వచ్చాయి.

ఆ కోవలోనే ఇప్పుడు తోడి పెళ్లికూతురు (బ్రైడ్స్ మెయిడ్) సర్వీసుకు కూడా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. సహజంగా పెళ్లికూతురు వెంట స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులు ఉంటారు. వారే పెళ్లి కూతురుకు సంబంధించిన సమస్త వ్యవహారాలు చూసుకుంటారు. పెళ్లి కూతురులా ఎలా ముస్తాబు కావాలి? ఎలాంటి దుస్తులు ధరిస్తే నప్పుతుంది? ఎలాంటి నగలు వేసుకోవాలన్న సంశయం చాలామంది పెళ్లి కూతుళ్లకు కలగడం సహజం. బంధుమిత్రులను అడగాలంటే మొహమాటం అడ్డు రావచ్చు. ఒకవేళ అడిగినా, వాళ్లు ప్రొఫెషనల్స్ కాకపోవడంతో ఆ సలహాలు, సూచనలు నప్పకపోవచ్చు.

సరిగ్గా అలాంటి సందర్భాల్లోనే తోడి పెళ్లికూతురు సర్వీసు ఎంతో సహకరిస్తుంది. పెళ్లీడుకు వచ్చిన యువతులే ఎక్కువగా బ్రైడ్స్‌మెయిడ్‌ను ప్రొఫెషనల్ వృత్తిగా స్వీకరిస్తున్నారు. అందచందాలతో పాటు కలుపుగోలుతనం, చలాకీతనం, అప్పటికప్పుడు కమ్మని కథలల్లే నేర్పు, ఓర్పు ఉన్నవాళ్లే ఈ వృత్తిలో రాణిస్తున్నారు. వారిలో న్యూయార్క్‌కు చెందిన జెన్ గ్లాంట్జ్ అనే 28 ఏళ్ల యువతికి ఇప్పుడు యమ గిరాకీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి తోడి పెళ్లికూతురుగా ఆమె సర్వీసు కావాలంటూ ఆమెకు ఆర్డర్లు వస్తున్నాయి. రెండేళ్లుగా ఈ వృత్తిని చేస్తున్న ఆమెకు ఇప్పుడు చేతుల్లో పదివేల దరఖాస్తులు ఉన్నాయి.

పెళ్లికూతురును అందంగా అలంకరించడం నుంచి పెళ్లి తంతు ముగిసేవరకు అన్నీ తానై పెళ్లి కూతురును అంటుకు తిరగాలి. పెళ్లికూతురు అభిరుచులుకు తగ్గట్టుగా కట్టు, బొట్టు దగ్గరి నుంచి దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. బిడియపడే పెళ్లికూతుళ్లకు కబుర్లు చెబుతూ ఉల్లాసపర్చాలి. బంధుమిత్రుల్లో ఇట్టే కలసిపోవాలి. అద్దెకు వచ్చిన తోడి పెళ్లి కూతురనే విషయం బయటకు తెలియకుండా నడుచుకోవాలి. పెళ్లి కూతురుకు చాలా సన్నిహిత మిత్రురాలనో, దూరపు బంధువనో, చిన్నప్పటి స్నేహితురాలనో అందరినీ నమ్మించాలి. అవసరమైతే పెళ్లి కొడుకును కూడా నమ్మించాలి. అందుకోసం అప్పటికప్పుడు కథలు కూడా అల్లాల్సి వస్తుంది.

ఒకేరోజు రెండు, మూడు పెళ్లిళ్లు బుక్కవడం వల్ల ఇబ్బందులు పడ్డ రోజులు లేకపోలేదని జెన్ చెప్పారు. ఒక్కో పెళ్లిలో ఒక్కో కథ చెప్పినప్పుడు, ఏ పెళ్లిలో ఏ కథ చెప్పానో, పెళ్లి కూతురుకు ఏ వరుసయ్యానో మరచిపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని ఆమె హెచ్చరించారు. ఇప్పుడు జెన్ దగ్గర అనేకమంది తోడి పెళ్లికూతుళ్లు పనిచేస్తున్నారు. ఒకే రోజు ఎక్కువ మంది అవసరం అవుతోందని, కొందరు ఒక్క పెళ్లికే ఐదారు బ్రైడ్స్‌మెయిడ్‌ను అడుగుతున్నారని, మూడు రోజుల నుంచి పది రోజుల వరకు తోడి పెళ్లి కూతుళ్లు అడుగుతున్న వాళ్లు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. ప్యాకేజీలను బట్టి ఒక్కో బ్రైట్స్‌మెయిడ్‌కు 300 డాలర్ల నుంచి రెండువేల డాలర్ల వరకు చార్జి చేస్తామని 'బ్రైడ్స్‌మెయిడ్ ఆన్ హైర్' అనే వెబ్‌సైట్ నిర్వహిస్తున్న జెన్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ బిజినెస్ బాగానే ఉందిగానీ పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్లను వదిలేసి తోడి పెళ్లికూతుళ్లపై మనసు పారేసుకుంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో!

మరిన్ని వార్తలు