యుద్ధరంగంలో రోబోలు

12 Dec, 2018 23:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రయత్నాలను మొదలుపెట్టిన బ్రిటన్‌

ఇంగ్లండ్‌: ప్రస్తుతం మనుషులు చేస్తున్న, చేయలేని దాదాపు అన్ని పనులనూ రోబోలు చేస్తున్నాయి. నైపుణ్యంతో సంబంధం ఉన్న పనులను కూడా రోబోలు చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మనల్ని మరింత ఆశ్చర్యానికి, భయానికి లోనుచేసే ఓ వార్త సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే... త్వరలో రోబోలు యుద్ధరంగంలోకి అడుగుపెట్టబోతున్నాయట. ఈ మాట ఎప్పటి నుంచో వింటున్నా.. ఈ విషయంలో బ్రిటన్‌ ప్రభుత్వం ముందడుగు వేసింది. బ్రిటిష్‌ సైన్యంలో రోబోలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆటోమెటిక్‌ ఆయుధాలను పరీక్షించే ప్రయత్నాలను మొదలుపెట్టింది.

ఎక్కడో దూరంగా ఉండి కంట్రోల్‌ చేసే సాయుధ వాహనాలు, రోబో గన్‌లను విజయవంతంగా పరీక్షించారు. అయితే తాము మనుషులను చంపే రోబోలను తయారు చేయడం లేదని బ్రిటన్‌ చెబుతోంది. కానీ ఇలాంటి ఆయుధాల వినియోగంపై కొన్ని నైతికపరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘మేం మానవ నియంత్రణ లేకుండా యుద్ధ రంగానికి వెళ్లి, పోరాటం చేసే ఆటోమెటిక్‌ వాహనాలను ఎప్పుడూ ఉపయోగించబోమ’ని బ్రిటిష్‌ సైన్యానికి చెందిన బ్రిగేడియర్‌ కెవిన్‌ కాప్సీ తెలిపారు. అయితే యుద్ధంలో వాటంతటవే పనిచేసే ఆయుధాలను ఉపయోగించడంపై ఇప్పటి వరకు ఎలాంటి చట్టాలు లేవు. ఈ విషయమై నోబెల్‌ గ్రహీతలు, హక్కుల సంస్థలు మాత్రం ఇలాంటి ఆయుధాలను నిషేధించాలని కోరుతున్నారు.    

మరిన్ని వార్తలు