తుది దశకు బ్రిటన్‌ ప్రధాని రేసు

21 Jun, 2019 04:18 IST|Sakshi
బోరిస్‌ జాన్సన్‌, మైఖేల్‌ గోవ్‌

లండన్‌: బ్రిటన్‌  ప్రధానిగా థెరిసా మే స్థానంలో కొత్త కన్జర్వేటివ్‌ పార్టీ నేతను ఎన్నుకునే ప్రక్రియ గురువారం తుది దశకు చేరుకుంది. పాకిస్తాన్‌ సంతతికి చెందిన హోం మంత్రి సాజిద్‌ జావిద్‌ పోటీ నుంచి నిష్క్రమించగా ఈ పదవికి రేసులో ఉన్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి బోరిస్‌ జాన్సన్‌ తిరుగులేని మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. రహస్య బ్యాలెట్ల తుది రౌండ్‌లో బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రి జెరెమై హంట్‌ను పర్యావరణ శాఖ మంత్రి మైఖేల్‌ గోవ్‌ వెనక్కినెట్టడంతో ఈ రేసులో రెండో స్థానం కోసం జరుగుతున్న యుద్ధం మలుపు తిరిగింది.

తాజా సమాచారం ప్రకారం జాన్సన్‌ 157 ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా గోవ్‌ (61) హంట్‌ (59) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బ్రిటన్‌ సీనియర్‌ మోస్ట్‌ మంత్రి అయిన జావిద్‌కు మూడవ దశలో కేవలం 34 ఓట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో జాన్సన్, గోవ్‌ ప్రధాని పదవికి పోటీ పడనున్నారు. తుది ప్రక్రియలో భాగంగా వారు పలు సమావేశాల్లో ఓటర్లనుద్దేశించి ప్రసంగించాల్సి ఉంటుంది. రెండు టీవీ చర్చల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. జూలై 22న విజేతను ప్రకటించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు