తప్పే.. కానీ క్షమాపణ చెప్పం!

7 Dec, 2017 21:32 IST|Sakshi
అమృత్‌సర్‌లో జలియన్‌వాలా బాగ్‌ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్న లండన్ మేయర్ సాదిక్ ఖాన్

జలియన్‌వాలా బాగ్‌ మారణహోమంపై మారని బ్రిటిష్‌ ప్రభుత్వ వైఖరి

జలియన్‌వాలా బాగ్‌ మారణకాండ.. భారత స్వాతంత్య్ర చరిత్రలో అత్యంత భయంకరమైన పీడకల. ఈ మారణహోమానికి వందేళ్లు పూర్తికావస్తున్నా.. దానికి కారణమైన బ్రిటిష్‌ ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తోందే తప్ప.. ఆనాటి గాయాలను మాన్పేందుకు ఎన్నో రోజులుగా డిమాండ్‌ చేస్తున్న ‘క్షమాపణ’ మాత్రం చెప్పడంలేదు.

లండన్‌: జలియన్‌వాలా బాగ్‌ ఘటనకు బ్రిటిష్‌ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందేనని లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ మరోసారి డిమాండ్‌ చేశారు. 1919లో జరిగిన ఈ మారణహోమం బ్రిటిష్‌ చరిత్రకు మాయని మచ్చగా మిగిలిందన్నారు. వేలాదిమంది భారతీయుల కుటుంబాల్లో దుఃఖాన్ని మిగిల్చిన దుర్ఘటనకు త్వరలోనే వందేళ్లు పూర్తవుతున్న విషయాన్ని సాదిఖ్‌ గుర్తుచేశారు. భారతీయులకు క్షమాపణ చెప్పేందుకు ఇదే సరైన సమయమని సాదిఖ్‌ అభిప్రాయపడ్డారు. ఓ వాణిజ్య కార్యక్రమం కోసం భారత్‌కు వచ్చిన ఆయన జలియన్‌వాలా బాగ్‌ ఘటన చోటుచేసుకున్న ప్రాంతాన్ని సందర్శించి, అమరులకు నివాళులర్పించారు.  

గతంలో కూడా.. : గతంలో కూడా బ్రిటిష్‌ ప్రధానమంత్రి డేవిడ్‌ కామెరూన్‌ భారత పర్యటనకు వచ్చినప్పుడు జలియన్‌వాలా బాగ్‌ ఘటనను అత్యంత దురదృష్టకరమైనదిగా అభివర్ణిస్తూ విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వం తలదించుకునే ఘటనగా కూడా అభివర్ణించారు. అప్పటి డయ్యర్‌ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే క్షమాపణ చెప్పడాన్ని దాటవేశారు. 1997లో బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్, ఆమె భర్త, ప్రిన్స్‌ ఫిలిప్‌లు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పటికీ క్షమాపణలు మాత్రం చెప్పలేదు.

‘నేను చాలా స్పష్టంగా చెబుతున్నా. నాటి దురాగతానికి బ్రిటిష్‌ ప్రభుత్వం క్షమాపణలు చెప్పేందుకు ఇదే సరైన సమయం. బాధితుల గాయాలకు బ్రిటిష్‌ ప్రభుత్వం చెప్పే క్షమాపణలే మందు. ఈ విషయమై బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నా వంతుగా కృషి చేస్తూనే ఉంటా’  – లండన్‌ మేయర్‌, సాదిక్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు