బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌కూ కరోనా

26 Mar, 2020 02:16 IST|Sakshi

చైనాను మించిన స్పెయిన్‌

లండన్‌: బ్రిటన్‌ రాజకుమారుడు చార్లెస్‌కూ కరోనా వైరస్‌ సోకింది. ఛార్లెస్‌లో వ్యాధి లక్షణాలు పెద్దగా లేవని, స్వీయ నిర్బంధం పాటిస్తున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు బుధవారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. అధికార వర్గాలు తెలిపిన దాని ప్రకారం బుధవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 20వేలమందికిపైగా మరణించారు. మొత్తం 181 దేశాల్లో 4.45 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.

బాధితులు సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా చోట్ల ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరమున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తూండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటలీలో ఫిబ్రవరిలో తొలి కోవిడ్‌ మరణం నమోదు కాగా, నెల తిరక్కుండానే ఆ దేశంలో సుమారు 6,820 మంది ప్రాణాలు కోల్పోవడం, వ్యాధి పుట్టిన చైనా కంటే ఎక్కువ మరణాలు స్పెయిన్‌లోనూ సంభవించడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. తాజా లెక్కల ప్రకారం చైనాలో 3281 మరణాలు సంభవించగా స్పెయిన్‌లో ఈ సంఖ్య 3434కు చేరుకుంది. వ్యాప్తి కట్టడికి స్పెయిన్‌ అనేక కఠిన చర్యలు చేపట్టినప్పటికీ సుమారు 47,610 మంది వ్యాధి బారిన పడ్డారని అధికారులు చెబుతున్నారు. ఆఫ్రికా దేశం కామరూన్, నైజర్‌లో మంగళవారం తొలి కరోనా మరణాలు నమోదయ్యాయి.  

బ్రిటన్‌ రాజకుటుంబానికి పరీక్షలు
బ్రిటన్‌ రాజకుటుంబానికి సోమవారం కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా చార్లెస్‌కు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన భార్య కెమిల్లాతో కలిసి స్కాట్లాండ్‌లో స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. కెమిల్లాకు వ్యాధి లేనట్లు తేలింది.  

ఇరాన్‌లో రెండువేలకు పైమాటే
ఇరాన్‌లో బాధితుల సంఖ్య 2077కు చేరుకుంది. తాజాగా 24 గంటల్లో 143 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. దేశంలో కోవిడ్‌ బారిన పడ్డ వారి సంఖ్య 27,017గా ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు