కరోనా: బ్రిటన్‌ రాణి వీడియో సందేశం

6 Apr, 2020 15:22 IST|Sakshi

లండన్‌ : ‘అందరం కలిసి కట్టుగా కరోనాను ఎదుర్కొంటున్నాం. ఇకమీదట కూడా ఇలాంటి ఐక్యతను ప్రదర్శించినట్లైతేనే దాన్నుంచి బయటపడగలుగుతామ’ని బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. విండ్సర్‌ క్యాసిల్‌లో చిత్రీకరించిన వీడియోను ఆదివారం ఆమె విడుదల చేశారు. ఆ వీడియోలో..  ‘‘మంచి రోజులు వస్తాయి. మనం మన స్నేహితులు, కుటుంబసభ్యులతో కలుసుకునే రోజులు. మనం మళ్లీ కలుసుకుంటామ’’ని అన్నారు. అనంతరం రెండవ ప్రపంచ యుద్ధ సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘ నేను మొదటిసారి వీడియో తీసుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. 1940లో మా అక్క ఆ వీడియోను తీసింది. అప్పుడు మేము చిన్న పిల్లలం. యుద్ధ సమయంలో ఇళ్లకు దూరమై బాధపడుతున్న పిల్లలను ఉద్ధేశించి ఆ వీడియోలో మాట్లాడాను’’ అని చెప్పారు. ( కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు )

ఆమె తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ ఈ రోజు చాలా మంది తమ ప్రియమైన వారికి దూరమై మరోసారి బాధపడుతున్నారు. కరోనా వైరస్‌పై పోరాటంలో మనం కచ్చితంగా విజయం సాధిస్తాం. ఈసారి ప్రపంచ దేశాలతో కలిసి మనం పోరాడుతున్నాం. అత్యాధునికమైన సైన్స్‌ మనకు అండగా ఉంది. మన స్వభావసిద్ధమైన కోలుకునే శక్తితో మనం కచ్చితంగా విజయం సాధిస్తాం. ఆ విజయం మనలోని ప్రతీ ఒక్కరికి చెందుతుంద’’ని అన్నారు. కాగా, బ్రిటన్‌లో ఇప్పటివరకు 47,806 మంది కరోనా వైరస్ బారిన పడగా.. 4,934 మంది మరణించారు. 

మరిన్ని వార్తలు