భారతీయుడుగా పరిగణను అంగీకరించని వైనం

25 Jul, 2018 22:19 IST|Sakshi

ఏ దేశంలో ఉన్నప్పటికీ భారతీయులు మాతృదేశాన్ని మరిచిపోకూడదని, మాతృదేశాభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోదీ సహా పలువురు నేతలు పదే పదే చెబుతోంటే...అసలు తమను భారతీయులుగా పరిగణించడానికి వీల్లేదని బ్రిటన్‌లోని అసంఖ్యాక సిక్కులు ఉద్ఘాటిస్తున్నారు.2021న జరిగే జనాభా లెక్కలకు సంబంధించిన దరఖాస్తు పత్రాల్లో తమ కోసం సిక్కు పేరుతో ప్రత్యేక జాతి కేటగిరిని పొందుపరచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటిలా భారతీయులు అన్న కేటగిరిలో తాము చేరబోమని వారు స్పష్టం  చేస్తున్నారు. జనాభా లెక్కల ప్రక్రియను నిర్వహించే ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటస్టిక్స్‌(ఓఎన్‌ఎస్‌)కు బ్రిటన్‌లోని పలు సిక్కు సంఘాలు ఈ మేరకు వినతి పత్రాలు సమర్పించాయి.అయితే, దీనిపై ఓఎన్‌ఎస్‌ ఇంకా  తుది నిర్ణయం తీసుకోలేదని, సిక్కుల అభ్యర్థనను పరిశీలిస్తున్నామని సంబంధిత అధికారులు చెప్పారు.2011 జనాభా లెక్కల సమయంలో 80వేల  మందికి పైగా సిక్కులు తమ దరఖాస్తు ఫారాల్లో జాతి/మతాన్ని తెలిపే కాలంలో భారతీయుడు అని కాని ఇతరులు అని కాని రాయలేదు.

సిక్కు అని ప్రత్యేకంగా రాశారు.బ్రిటన్‌లో 112 గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో లక్ష మందికిపైగా సభ్యులున్నారు.2021 జనాభా లెక్కల కోసం విడుదల చేసే సెన్సస్‌ వైట్‌ పేపర్‌2018లో తమ సిక్కు జాతి కోసం ప్రత్యేకంగా గడి పెట్టాలని కేబినెట్‌ ఆఫీస్‌కు సిఫారసు చేయాలని వారంతా ఓఎన్‌ఎస్‌కు విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిని ఓఎన్‌ఎస్‌ ఆమోదిస్తుందన్న విశ్వాసం ఉందని సిక్కు సమాఖ్య అంటోంది. ’వచ్చే జనాభా లెక్కల్లో తమను ప్రత్యేక జాతిగా గుర్తించాలని 55 వర్గాలు అభ్యర్థనలు పంపాయి. వాటిలో యూదులు, రోమన్లు, సిక్కులు, సోమాలీల అభ్యర్థనలు పరిశీలనలో ఉన్నాయి.’అని ఓఎన్‌ఎస్‌ అధికారి ఒకరు  తెలిపారు.సిక్కులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని గత ఏడాది పార్టీల కతీతంగా 250 మంది ఎంపీలు కూడా డిమాండ్‌ చేశారు.తమ సంతకాలతో ఓఎన్‌ఎస్‌కు వినతిపత్రాలు పంపారు.జనాభా లెక్కల్లో జాతుల ఆధారంగానే ప్రభుత్వం వారికి వివిధ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తుంది. ప్రభుత్వ నిధులను పంచుతుంది.
 
 

మరిన్ని వార్తలు