సరిహద్దుల్లో ఇక ‘గ్రేట్ వాల్ ఆఫ్ బ్రిటన్’

8 Sep, 2016 16:31 IST|Sakshi
సరిహద్దుల్లో ఇక ‘గ్రేట్ వాల్ ఆఫ్ బ్రిటన్’

లండన్: ఉత్తర ఫ్రాన్స్‌లోని కలాయ్ రేవు నగరం నుంచి దొంగచాటుగా తరలి వస్తున్న శరణార్థులను అడ్డుకునేందుకు భారీ అడ్డుగోడను నిర్మించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రాన్స్‌ను, బ్రిటన్‌ను వేరు చేస్తున్న ఇంగ్లీష్ ఛానల్ ఒడ్డున 13 అడుగుల ఎత్తుతో కిలోమీటరు పొడవున ఈ భారీ అడ్డుగోడను నిర్మించాలని నిర్ణయించినట్లు బ్రిటన్ వలసల శాఖ మంత్రి రాబర్ట్ గుడ్విల్ ప్రకటించారు.
 
గోడ నిర్మాణం కోసం ఫ్రాన్స్ ప్రభుత్వంతో 2.30 కోట్ల డాలర్లతో ఒప్పందం చేసుకున్నామని రాబర్ట్ తెలిపారు. కలాయ్ రేవు నగరం నుంచి బ్రిటన్‌లోకి శరణార్థులు రాకుండా అడ్డుకునేందుకు ఎత్తైన ఇనుప కంచెను నిర్మించినా ఫలితం లేకపోవడంతో తామీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ ప్రభుత్వం శరణార్థులను రిజిస్టర్ చేసుకుంటామని చెబుతున్నప్పటికీ శరణార్థులు ఇష్టపడకుండా బ్రిటన్లో చొరబడేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఇప్పటికే కలాయ్ రేవు నగరంలో 40 ఎకరాల్లో శరణార్థుల శిబిరాలు వెలిశాయి. అక్కడి నుంచి రకరకాల మార్గంలో బ్రిటన్‌లోకి ప్రవేశించేందుకు శరణార్థులు పడిగాపులు పడుతున్నారు. కొందరు కార్గో ట్రక్కుల డ్రైవర్లపై దాడులు చేసి, డబ్బులు ఇచ్చి వాటిలో దాక్కొని సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇంగ్లీషు ఛానల్ దాటేందుకు ప్రయత్నిస్తూ మృత్యువాత పడుతున్నారు. కలాయ్ శిబిరాల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన వివిధ జాతుల ప్రజలు ఉన్నారు. వారు దుర్భర దారిద్య్ర పరిస్థితుల్లో బతుకుతున్నారు.

 
శరణార్థులను అడ్డుకునేందుకు టాక్స్ పేయర్ల సొమ్ముతో అడ్డుగోడను కట్టడం అన్యాయమని ట్రక్కు డ్రైవర్ల సంఘం విమర్శించింది. అడ్డుగోడను కట్టినంతమాత్రాన వలసలను నిరోధించలేమని, దానికి బదులు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడమే ఉత్తమమైన మార్గమని ఆ సంఘం తెలిపింది. గోడ నిర్మాణానికి వెచ్చిస్తున్న సొమ్ములో సగం డబ్బుతోనే మూడంచెల భద్రతను ఏర్పాటు చేయవచ్చని, భద్రతను పెంచడం వల్ల సరిహద్దుల్లో తమపై శరణార్థులు జరపుతున్న దాడులను కూడా అడ్డుకోవచ్చని డ్రైవర్ల సంఘం సూచించింది.
 

మరిన్ని వార్తలు