3.8 లక్షల క్రెడిట్‌కార్డులు హ్యాక్‌

8 Sep, 2018 03:17 IST|Sakshi

అన్నీ బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ ప్రయాణికులవే

లండన్‌: బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ ప్రయాణికుల క్రెడిట్‌ కార్డు వివరాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు సంస్థ మొబైల్‌ యాప్‌ ద్వారా, ఎయిర్‌వేస్‌ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసిన 3.8లక్షల  ప్రయాణికుల క్రెడిట్‌ కార్డు వివరాలు చోరీఅయ్యాయని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. ఈ వివరాలు దుర్వినియోగంకాకుండా ఆపేందుకు యత్నిస్తున్నామని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో అలెక్స్‌ క్రూజ్‌ చెప్పారు. పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు.

‘ప్రయాణికుడి పేరు, చిరునామా, ఈ–మెయిల్‌ అడ్రస్, క్రెడిట్‌ కార్డు సమాచారాన్ని (కార్డు నెంబరు, ఎక్సై్పరీ డేట్, సీవీసీ కోడ్‌) హ్యాకర్లు సంపాదించారు. ప్రయాణికుల పాస్‌పోర్టు వివరాలు హ్యాక్‌ కాలేదు’ అని క్రూజ్‌ చెప్పారు. ఆగస్టు 21 – సెప్టెంబర్‌ 5 మధ్య టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు కార్డులను బ్లాక్‌ చేసుకోవాలని ఆయన కోరారు. బ్రిటీష్‌ నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీకి సమాచారం అందించామని చెప్పారు. కాగా, పలువురు ప్రయాణికులు తమ క్రెడిట్‌ కార్డును ఎవరో వాడుకున్నట్లు ఫోన్‌కు సందేశాలు వచ్చాయని బ్రిటన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు.  

పెద్ద కంపెనీల్లో భద్రత డొల్లే!
డిజిటల్‌ సర్వీసులను కల్పించే ప్రయత్నంలో కనీస భద్రత కల్పించకపోవడంపై బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌పై ప్రయాణికులు సహా ఐటీ నిపుణులు మండిపడుతున్నారు. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌లో ఐటీ సంబంధిత సమస్య తలెత్తడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది మేలో కంప్యూటర్‌ వ్యవస్థలో లోపాల కారణంగా 700కు పైగా విమానాలు హఠాత్తుగా రద్దవడం.. 75వేల మంది ప్రయాణికులు వివిధ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. అమెరికాలోని డెల్టా ఎయిర్‌లైన్స్‌ కూడా మాల్‌వేర్‌ కారణంగా తమ ప్రయాణికుల చెల్లింపుల వివరాలు బహిర్గతమయ్యేందుకు ఆస్కారముందని ఈ ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించింది.  

మరిన్ని వార్తలు