ట్రక్కులో 39 మృతదేహాలు

24 Oct, 2019 03:17 IST|Sakshi
భారీ సంఖ్యలో మృత దేహాలు దొరికిన ట్రక్కు ఇదే

లండన్‌లో కలకలం

బల్గేరియా నుంచి వచ్చినట్లుగా అనుమానం

లండన్‌: లండన్‌ దగ్గర్లో బుధవారం 39 మృతదేహాలున్న ఒక ట్రక్కు కనిపించి సంచలనానికి కారణమైంది. ఆ మృతదేహాలెవరివి, మరణాలకు కారణాలేంటి అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ట్రక్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. గ్రేస్‌  ఏరియా ఆఫ్‌ ఎసెక్స్‌ దగ్గర్లో ఉన్న వాటర్‌గ్లేడ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ సమీపంలో మృతదేహాలున్న ఒక ట్రక్కు ఉందని బుధవారం తమకు సమాచారం వచ్చిందని ఎసెక్స్‌ పోలీసులు తెలిపారు. ఆ ట్రక్కు బల్గేరియా నుంచి వచ్చినట్లు తెలిసిందని, వేల్స్‌లోని హోలీహెడ్‌ రేవు ద్వారా శనివారం యూకేలోకి వచ్చినట్లు గుర్తించామని వెల్లడించారు.

నార్త్‌ ఐర్లండ్‌కు చెందిన ట్రక్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి వివరాలు రాబడ్తున్నామని ఎసెక్స్‌ పోలీస్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌ అండ్య్రూ మారినర్‌ చెప్పారు. బల్గేరియా నుంచి అక్రమంగా బ్రిటన్‌లోకి వచ్చే క్రమంలో వారు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలున్న ట్రక్‌ వెనుకభాగంలో మైనస్‌ 25 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్న ఫ్రీజర్‌ ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అందులో దాక్కుని హోలీహెడ్‌ రేవు ద్వారా అక్రమంగా బ్రిటన్‌లోకి వస్తూ చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఇలాగే ఒక లారీ వెనుకభాగంలో దాక్కుని అక్రమంగా బ్రిటన్‌లోకి వస్తూ 58 మంది చైనీయులు చనిపోయారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా