ఐఎస్ ఉగ్రవాదిని పెళ్లాడిన బ్రిటీష్ విద్యార్థిని

12 Jul, 2015 19:44 IST|Sakshi
ఐఎస్ ఉగ్రవాదిని పెళ్లాడిన బ్రిటీష్ విద్యార్థిని

లండన్: యువతీ యువకులు పెద్ద ఎత్తున ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిరియా బాటపడుతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్న ప్రస్తుత తరుణంలో ఓ పాఠశాల విద్యార్ధిని.. కరడుగట్టిన జీహాదీని పెళ్లాడిన ఉదంతం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే..

బ్రిటన్కు చెందిన అమీరా అబ్బాసీ వయసు 16 ఏళ్లు. ఇంకా స్కూలింగ్ కూడా పూర్తికాలేదు. లండన్లో నివసిస్తోన్న ఆమె.. గత ఫిబ్రవరి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. కొద్ది కాలానికి ఆమె జాడను కనిపెట్టిన నిఘావర్గాలు.. ఇద్దరు స్నేహితులతో కలిసి అబ్బాసీ సిరియాకు వెళ్లి ఐఎస్లో చేరినట్లు నిర్ధారించారు. ఇదిలా ఉంటే, శనివారం నాడు ఆమె ఆస్ట్రేలియా జాతీయుడైన జీహాదీని పెళ్లాడినట్లు తెలిసింది. సదరు ఆస్ట్రేలియన్ జీహాదీ మామూలు వ్యక్తేమీకాదు.కరడుగట్టిన ఉగ్రవాది. ఐఎస్ విడుదల చేసిన పలు వీడియోల్లో తరచూ కనిపిస్తూంటాడు. పేరు అబ్దుల్లా ఎల్మిర్. రెండేళ్ల కిందట సిడ్నీలోని ఓ మాంసం దుకాణంలో పనిచేశాడు. ఆ తరువాత సిరియాకు వెళ్లి ఇస్లామిక్ జీహాదీగా మారిపోయాడు.

అబ్బాసీతో తన వివాహం నిజమేనని ఇంటర్నెట్ ద్వారా తెలిపాడు ఎల్మిర్. అంతేకాదు.. లండన్లోని బకింగ్హం ప్యాలెస్.. వాషింగ్టన్లోని  వైట్హౌజ్లపై ఐఎస్ఐఎస్ జెండా అధికారికంగా ఎగిరేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఆ క్రమంలో ఎన్ని దాడులు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించాడు. ట్యునీషియాలో 36 మంది బ్రిటన్ పౌరుల్ని మట్టుబెట్టిన సోదర జీహాదీ చర్యను సమర్థిస్తూ బ్రిటిషర్లకు హెచ్చరికలు పంపాడు.

మరిన్ని వార్తలు