ప్రేమ వ్యవహారం.. యువతికి వినూత్న శిక్ష

26 Sep, 2018 21:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లండన్‌ : ప్రేమించినవాడు దక్కలేదన్న అక్కసుతో ఓ బ్రిటిష్‌ సిక్కు యువతి మూర్ఖంగా ప్రవర్తించి జైలు పాలయింది. దాదాపు అయిదేళ్లుగా మాజీ ప్రియుడినీ, అతని కుటుంబ సభ్యులను టార్చర్‌ చేస్తున్న అమన్‌దీప్‌ ముధార్‌ (26).. ఆమె ఫ్రెండ్‌ సందీప్‌ డోగ్రా (30)కు ఇంగ్లండ్‌లోని సీన్‌డన్‌ క్రౌన్‌ కోర్టు వినూత్నమైన శిక్ష విధించింది. జాతివివక్ష, మత విశ్వాసాలు, సామాజిక సంబంధాల పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు వారిద్దరికీ రెండేళ్ల సస్పెండెడ్‌ జైలు శిక్ష అమలు చేయాలని స్వీన్‌డన్‌ క్రౌన్‌ కోర్టు మంగళవారం అధికారులను ఆదేశించింది.

కోర్టు తెలిపిన వివరాలు.. ముధార్‌, కృపాకర్‌ (పేరుమార్చాం) అనే హిందూ యువకుడు 2012లో ప్రేమలోపడ్డారు. అయితే, కొన్నాళ్లపాటు కలిసున్న అనంతరం మతాలు, సంప్రదాయాల విషయంలో మనస్పర్థలతో వారిద్దరు విడిపోయారు. ఇక అప్పటినుంచి యువకుడిపై పగ పెంచుకున్న ముధార్‌ తన మిత్రుడు సందీప్‌తో కలిసి కృపాకర్‌పై కక్ష సాధింపు మొదలు పెట్టింది. అతని కుటుంబ సభ్యులను మతం, జాతి పేరుతో దూషిస్తూ.. సోషల్‌ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టింది. కృపాకర్‌ చెల్లెల్లను రేప్‌ చేయిస్తానని బెదిరింపులకు గురిచేసింది. వారి మత విశ్వాశాలు దెబ్బతినేలా ప్రవర్తించింది. కృపాకర్‌ కుటుంబం వెళ్లే దేవుడి సన్నిధిలో సైతం దుర్భాషలాడింది. అంతటితో ఆగక వాళ్లింట్లో పశు మాంసం పారవేసింది. ఇంకా... కృపాకర్‌ చెల్లెలి కొడుకుని స్కూల్లో మరో పిల్లాడితో కలిసి వేధింపులకు గురిచేసింది.

రెండేళ్ల సస్పెండెడ్‌ జైలు శిక్ష మాత్రమే కాకుండా.. మత విశ్వాశాలపై దాడి చేసినందుకు 100 గంటల ధార్మిక సేవ, కోర్టు ఫీజుల కింద 750 పౌండ్ల జరిమానా విధించింది. కాగా, ముధార్‌ చిన్నతనంలో ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగానే మొండితనం, పెంకితనం వచ్చాయనీ ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తల్లి సంరక్షణలో వేధింపులకు గురికావడంతోనే అలా తయారైందని విన్నవించారు. అతని వాదనలతో ఏకీభవించని కోర్టు ఈ వినూత్న శిక్షతో ముధార్‌ ప్రవర్తనలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించింది. మరోవైపు.. లండన్‌లోని సిక్కు కమ్యునిటీ కూడా ముధార్‌, సందీప్‌ చర్యలపై మండిపడింది. వారికి ఎటువంటి సాయం చేయబోమని ప్రకటించింది.

సస్పెండెడ్‌ జైలు శిక్ష అనగా..
సాధారణ జైలు శిక్ష విధించే క్రమంలో ముద్దాయిలకు ఒక అవకాశంగా సస్పెండెడ్‌ జైలు శిక్ష విధిస్తారు. ఈ  శిక్షా కాలంలో ముద్దాయి ప్రవర్తనపై నిఘా ఉంచుతారు. విపరీత మనస్తత్వం కలిగిన సమూహంలో వారిని విడిచిపెడతారు. అక్కడ వారు మళ్లీ ఎలాంటి తప్పులు చేయకుండా సత్ప్రవర్తనతో శిక్షా కాలం పూర్తి చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. అలాకాకుండా సస్పెండెడ్‌ జైలు శిక్ష కాలంలో కూడా నేరాలకు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే వాటిపై విచారణ చేసి మునుపటి జైలు శిక్ష.. తాజా శిక్షను విధించి కటకటాల వెనక్కి పంపుతారు.

మరిన్ని వార్తలు