మాజీ ప్రియురాలిపై యాసిడ్‌ దాడి

8 May, 2017 16:33 IST|Sakshi
మాజీ ప్రియురాలిపై యాసిడ్‌ దాడి

రిసార్ట్‌లో సేద తీరుతున్న ప్రియురాలిపై కక్ష్య గట్టిన మాజీ ప్రియుడు ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటన లిస్బన్‌ నగరంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అల్గర్వ్‌ రిసార్ట్‌లో సేద తీరుతున్న మహిళ(29)తో మాట్లాడాలని మాజీ ప్రియుడు ఆమెకు కబురుపెట్టాడు. అతని కలవడానికి రోడ్డు మీదకు వెళ్లిన ఆమెపై చుట్టు పక్కల ఎవరూ లేని సమయం చూసిన అతను రెండు లీటర్ల యాసిడ్‌ను ఆమెపై పోశాడు.

దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయి పెద్ద పెట్టున కేకలు పెట్టింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాసిడ్‌ దాడిలో బాధితురాలి శరీరంలో 30 శాతం పూర్తిగా కాలిపోయిందని.. స్పెషలిస్టు డాక్టర్లు ఆమెకు వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారని తెలిపారు. కాగా, ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డులో యాసిడ్‌ దాడి జరగడంపై లిస్బన్‌ నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం ఓ క్లబ్‌లో ఇద్దరు యువకులపై కొందరు విషవాయువు ప్రయోగించడంతో వారు చూపు కోల్పోయారు.

మరిన్ని వార్తలు