బ్రిటిష్ యువతి దారుణ హత్య

24 Aug, 2016 07:59 IST|Sakshi
బ్రిటిష్ యువతి దారుణ హత్య

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ సమీప ప్రాంతంలో బ్రిటిష్ యువతిని దారుణంగా పొడిచి చంపారు. బ్యాక్‌ప్యాకర్స్ హాస్టల్లో 30 మంది చూస్తూ ఉండగానే ఓ ఫ్రెంచి వ్యక్తి ఆమెను చంపేశాడు. పోలీసులు అక్కడకు వచ్చేసరికే 21 ఏళ్ల వయసున్న ఆ బ్రిటిష్ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు మరో బ్రిటిష్ వ్యక్తి (30) కూడా కత్తిపోట్లకు గురయ్యాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరినీ పొడిచిన ఫ్రెంచి వ్యక్తి (29)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసలు అక్కడ ఏం జరిగింది, హత్యకు కారణం ఏంటన్న విషయాలు తెలుసుకోడానికి తము ప్రయత్నిస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ రే రోవెదర్ తెలిపారు. పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత నిందితుడు వాళ్లను ఎదుర్కోడానికి ప్రయత్నించడంతో బాగా కష్టపడాల్సి వచ్చింది. సుమారు 30 మంది వ్యక్తులు అక్కడి పరిస్థితిని చూసి హడలిపోయారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేసేందుకు వీలుగా బ్రిటిష్ కాన్సులేట్‌ను తాము సంప్రదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతడు తప్ప వేరే నిందితులు ఎవరి కోసం ఈ కేసులో గాలించడం లేదని రోవెదర్ చెప్పారు.

మరిన్ని వార్తలు