గుడి మొత్తం బీర్‌ సీసాలతో...

29 May, 2018 11:36 IST|Sakshi
వాట్‌ పా మహా చెది కయూ ఆలయ ప్రాంగణం

బ్యాంకాక్‌: ఆలయం.. మద్యం... ఈ రెండింటికి చాలా దూరం. అలాంటిది ఏకంగా బీర్‌ బాటిళ్లతోనే గుడి కట్టేస్తే ఎలా ఉంటుంది. థాయ్‌లాండ్‌లో కొందరు దీనిని ఆచరించి చూపారు. బీర్‌ బాటిళ్లతో బుద్ధుడి ఆలయాన్ని నిర్మించగా,  బౌద్ధ సన్యాసులే స్వయంగా ఈ నిర్మాణంలో పాలుపంచుకోవటం గమనార్హం.

ఖూన్‌ హన్‌ జిల్లా సిసాకెట్‌ ప్రొవిన్స్‌లోని ‘వాట్‌ పా మహా చెది కయూ’  బుద్ధుడి ఆలయం. 1984లో సముద్ర ప్రాంతం వద్ద చెత్త సేకరణలో పాల్గొన్న కొందరు బౌద్ధ సన్యాసులు కుప్పులు కుప్పలుగా పడి ఉన్న బీర్‌ బాటిళ్లను గమనించారు. వెంటనే వారికి ఓ ఆలోచన తట్టింది. ఇటుకలకు బదులుగా బీర్‌ బాటిళ్లతో అందంగా ఆ గుడిని రూపొందించారు. సుమారు 10 లక్షలకు పైగానే ఖాళీ బీర్‌ సీసాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంతోపాటు, మెట్లు, నేల, వాష్‌రూమ్‌లు, విశ్రాంతి గది ఇలా అన్నీ బీర్‌ సీసాలతో నిర్మించినవే. 

అంతెందుకు బుద్ధుడి చిత్రాన్ని కూడా బీర్‌ బాటిళ్ల మూతలను రీ సైక్లింగ్‌ చేసి తయారు చేయటం విశేషం. హైనకెన్‌, ఛాంగ్‌ అనే రెండు బీర్‌ కంపెనీలకు చెందిన సీసాలే ఉన్నాయంట. ఈ బీర్‌ టెంపుల్‌ ద్వారా సిసాకెట్‌ పర్యాటక ప్రాంతంగా విరజిల్లుతోంది.

మరిన్ని వార్తలు