స్టోన్‌హెంజ్‌ను నిర్మించింది వీళ్లేనట!

6 Aug, 2018 04:42 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌లోని వెస్సెక్స్‌ ప్రాంతంలో ఉండే స్టోన్‌హెంజ్‌ను నిర్మించిందెవరో శాస్త్రవేత్తలు ఎట్టకేలకు గుర్తించారు. భారీ బండరాళ్లతో నిర్మితమై వలయాకారంలో ఉండే స్టోన్‌హెంజ్‌ను ఎవరు ఏర్పాటు చేసి ఉంటారన్న విషయం ఇన్నాళ్లూ అంతుచిక్కకపోవడం తెలిసిందే. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఆ గుట్టు విప్పారు. పూర్వం వెస్సెక్స్, వేల్స్‌ తదితర ప్రాంతాల్లో నివసించిన ప్రజలే ప్రెసేలీ పర్వతాల నుంచి అంత భారీ బండరాళ్లను మోసుకొచ్చి స్టోన్‌హెంజ్‌ను నిర్మించి ఉంటారంటున్నారు.

క్రీస్తు పూర్వం 3100 కాలంలో దీనిని నిర్మించి ఉంటారనీ, అప్పట్లో దీన్ని శ్మశానంగా ఉపయోగించేవారని తేల్చారు. కాగా, స్టోన్‌హెంజ్‌ ప్రాంతంలో 1920ల్లో వెలికి తీసిన  ఎముకలను ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు తాజాగా రేడియో కార్బన్‌ డేటింగ్‌ పద్ధతిని ఉపయోగించి పరిశీలించారు. 25 పుర్రెలను పరిశీలించిన శాస్త్రజ్ఞులు.. వారిలో కనీసం పది మంది చనిపోవడానికి ముందు స్టోన్‌హెంజ్‌ పరిసర ప్రాంతాల్లో నివసించిన వారు కాదనీ, పశ్చిమ బ్రిటన్‌లోని వేల్స్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారని తేల్చారు.

మరిన్ని వార్తలు