ఆ చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు.. ఏం చేస్తారంటే..

27 Feb, 2020 16:38 IST|Sakshi

సిడ్నీ: శారీరక ఎదుగుదల లోపం కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించిన చిన్నారి క్వాడెన్‌ బేల్స్‌కు సోషల్‌ మీడియా అండగా నిలిచింది. క్వాడెన్‌ కోసం అమెరికా కమెడియన్‌ బ్రాడ్‌ విలియమ్సన్‌ ప్రారంభించిన గోఫండ్‌మీ పేజ్‌ ద్వారా దాదాపు 4 లక్షల డెబ్బై ఐదువేల డాలర్లు పోగయ్యాయి. ఈ భారీ మొత్తాన్ని క్వాడెన్‌ తల్లికి పంపిన పేజీ నిర్వాహకులు.. చిన్నారిని డిస్నీల్యాండ్‌ ట్రిప్‌ కోసం ఈ నగదును సేకరించినట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన క్వాడెన్‌ బేల్స్‌ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు అచాన్రోప్లాసియాతో బాధపడుతున్నాడు. దీంతో మరుగుజ్జుగా ఉన్నావంటూ తోటి విద్యార్థులు అతడిని అవమానించేవారు. ఈ వేధింపులు తీవ్రతరం కావడంతో ఓరోజు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు.

ఈ విషయాన్ని తన తల్లికి చెబుతూ.. ‘‘నేను చనిపోవాలని అనుకుంటున్నా.. లేదంటే ఎవరైనా నన్ను చంపేయండి’’ అంటూ హృదయ విదారకంగా ఏడ్వసాగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్వాడెన్‌ తల్లి యర్రాక తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో షేర్‌ చేయగా వైరలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వాడెన్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ఆస్ట్రేలియా నటుడు హుగ్‌ జాక్‌మాన్‌తో పాటు ఎన్‌బీఏ ఆటగాడు ఎన్స్‌ కాంటెర్‌ క్వాడెన్‌ వంటి సెలబ్రిటీలు సైతం అతడికి అండగా నిలిచారు. ఈ క్రమంలో క్వాడెన్‌ సంతోషపెట్టడం కోసం అతడి డిస్నీల్యాండ్‌ ట్రిప్‌ కోసమని నెటిజన్లు భారీ ఎత్తున విరాళాలు  ఇచ్చారు. అయితే క్వాడెన్‌ తల్లి ఈ విరాళాన్ని... క్వాడెన్‌ కోసం కాకుండా చారిటీ కోసం ఉపయోగిస్తున్నట్లు ఆమె సోదరి మీడియాకు తెలిపారు.(తాడు ఇవ్వండి! ఉరేసుకుంటా..)

‘‘ఏ పిల్లాడైనా డిస్నీల్యాండ్‌ వెళ్లాలని ఆశపడతాడు. క్వాడెన్‌​ కూడా అంతే. అయితే తనను వాస్తవానికి దూరంగా తీసుకువెళ్లి సంతోష పెట్టడం మాకు ఇష్టం లేదు. ప్రతీ సవాలును ధీటుగా ఎదుర్కొనేలా తనను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకే నా సోదరి మంచి నిర్ణయం తీసుకుంది. అవమానాలు ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఇందుకోసం పనిచేస్తున్న సంస్థకు క్వాడెన్‌ డబ్బును వినియోగించాలని భావిస్తోంది’’ అని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు