బస్సు డ్రైవరే తల్లిలా మారి...

9 Apr, 2018 18:49 IST|Sakshi

ఆల్పైన్ : తల్లిలేని పిల్లకు తల్లిలా మారిందో మహిళా డ్రైవరు. రోజూ తన బస్సులో ప్రయాణించే చిన్నారికి తల దువ్వి జడేస్తూ ఆ బాలికకు అమ్మలేని లోటును కొంతైనా తీరుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉటా దేశంలోని ఆల్పైన్‌ నగరానికి చెందిన పదకొండేళ్ల ఇసబెల్లా పీరీ అనే అమ్మాయి రెండేళ్ల క్రితం తల్లిని కోల్పోయింది. క్యాన్సర్‌ వ్యాధితో  ఆమె మరణించగా.. అప్పటి నుంచి ఆ చిన్నారి తన పనులు తానే చేసుకుంటోంది. తండ్రి ఉద్యోగ రిత్యా ఉదయాన్నేలేచి వెళ్లిపోతుండటంతో.. సొంతగా పనులు చేసుకోవటం అలవర్చుకుంది. అయితే జడేసుకోవటం మాత్రం ఆ చిన్నారికి ఇబ్బందిగా అనిపించేది. ఓ రోజు  తాను వెళ్లే స్కూలు బస్‌ డ్రైవర్‌ ట్రేసీ డీన్‌.. ఓ విద్యార్థినికి జడవేయడం ఇసబెల్లా గమనించింది . తనకు కూడా జడవేయాల్సిందిగా ట్రేసీని కోరింది. అలా అప్పటి నుంచి రోజు ఆమెకు ఎంచక్కా ఆ డ్రైవర్‌ జడేస్తూ ముస్తాబు చేసేది. 

‘ట్రేసీ చేస్తున్న సేవలతో తాను ఆమెను ఓ తల్లిలా భావిస్తున్నాను’ అని ఇసబెల్లా చెబుతుండగా..  ట్రేసీ డీన్‌ స్పందిస్తూ.. ‘ఏడు సంవత్సరాల క్రితం నేను రొమ్ము క్యాన్సర్‌కి గురయ్యాను. ఆ సమయంలో నేను చనిపోతే నా పిల్లలను ఎవరు చూసుకుంటారనిపించింది. తండ్రి ఉన్నా.. తల్లి చేసే పనులు చేయలేరు. ప్రేమగా జడవేయడం తల్లికి మాత్రమే తెలుసు. అందుకే ఇసబెల్లా కోరికను తీరుస్తున్నా’ చెప్పారు. ఇసబెల్లాకు ట్రేసీ జడ వేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు