శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో హింస

17 Nov, 2019 04:41 IST|Sakshi

కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హింస చెలరేగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళుతున్న ముస్లిం ఓటర్ల బస్సుల కాన్వాయ్‌పై ఓ ముష్కరుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు జరపడంతోపాటు రాళ్లు కూడా విసిరాడని పోలీసులు వెల్లడించారు. దాదాపు 100 బస్సులున్న కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు మార్గంలో దుండగులు టైర్లు కాల్చి వేశారని తెలిపారు. కొలంబో దగ్గర్లోని తాంతిరిమలే ప్రాంతంలో ఘటన చోటుచేసుకుందని చెప్పారు. కాగా, ఎన్నికల్లో దాదాపు 80 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలతో పాటు దాదాపు 26 అంగుళాల పొడవైన బ్యాలెట్‌ పేపర్‌తో ఈసారి ఎన్నికలు రికార్డుల్లోకెక్కాయి. ఈ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి.

మరిన్ని వార్తలు