జంతు ప్రేమికులకు సరికొత్త అవకాశం!

5 Apr, 2016 16:45 IST|Sakshi
జంతు ప్రేమికులకు సరికొత్త అవకాశం!

జంతు ప్రేమికులు ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. పెట్స్ ను పెంచుకోవాలని ఇష్టం ఉన్నా తీరిక, సమయం తోపాటు వాటిని పెంచేందుకు సరిపడేంత డబ్బు లేక మనసులోనే ఇష్టాన్ని దాచుకొని బాధపడుతుంటారు. అటువంటి వారికి ఇప్పుడు 'క్యాట్ కేఫ్' లు అందుబాటులోకి వచ్చేశాయి. సరదాగా వాటితో గడపాలన్న కోరిక తీర్చుకునేందుకు కేవలం ఓ రెస్టరెంట్ కో, పార్కుకో వెళ్ళినట్లుగా క్యాట్ కేఫ్ లకు వెళ్ళి కాస్తా రిలాక్స్ అయ్యే అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అందుబాటులోకి తెచ్చారు. మంచి కాఫీ, కేక్ తోపాటు రెస్టారెంట్లలో దొరికే ఇతర పదార్థాలను వేడి వేడిగా అందిస్తూనే... పెట్స్ తో కాసేపు సరదాగా గడిపి, ఒత్తిడిని సైతం తగ్గించుకునే మార్గాలను కనిపెట్టారు.

క్యాట్ లవర్స్ కు ఇప్పుడు ఆకట్టుకునే వివిధ రకాల పిల్లులను అందుబాటులో ఉంచుతున్నాయి క్యాట్ కేఫ్ లు. ఇళ్ళల్లో పెంచుకునే పెంపుడు పిల్లుల్లానే ఇక్కడ ఎంతో ఆకర్షణీయంగా ఉండే పిల్లులకు సమయానికి తగ్గ అద్డెను చెల్లించి హాయిగా కాసేపు వాటితో గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. స్వతహాగా ఇంట్లో పిల్లులను పెంచుకునే సామర్థ్యం, అవకాశం లేనివారు ఈ కేఫ్ లను ఆశ్రయించేందుకు వీలుగా వీటిలో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలను కూడా కేఫ్ యాజమానులు అందుబాటులో ఉంచుతున్నారు. పిల్లులతో ఆడుకునేందుకు వచ్చిన వారికి వేడి వేడి కాఫీ, స్నాక్స్, కేక్స్ కూడా అందిస్తున్నారు.

యాజమానుల పర్యవేక్షణలో ఉండే ఆరోగ్యవంతమైన ఆకర్షణీయమైన పిల్లలను జంతు ప్రేమికులకు అందుబాటులో ఉంచడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద వ్యాపారంగా మారిపోయింది. కేఫ్ యజమానులు మాగజైన్లు, న్యూస్ పేపర్లు, టీవీల్లోనే కాక, ఇంటర్నెట్ లో కూడా  విభిన్న ప్రకటనలతో జంతుప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సెలవు రోజుల్లోనూ, సాయంత్ర సమయాల్లోనూ విజిటర్స్ కు ప్రత్యేక ఆఫర్లు కూడ ఇస్తున్నారు. సిద్ధహస్తులు తయారు చేసే కాఫీ పానీయాలతోపాటు...  ప్రత్యేక సర్వీసును కూడ అందిస్తామంటూ ఆకట్టుకుంటున్నారు. మా వద్దకు రండి... మీ ఒత్తిడి తగ్గించుకోండి అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అంతేకాదు పిల్లులను పెంచుకోవాలనుకునేవారికి అందుబాటులో ఎన్నో రకాల మేలిమి జాతి పిల్లులు అందుబాటులో ఉన్నాయంటూ స్వాగతం పలుకుతున్నారు. పిల్లులను దత్తత చేసుకునేవారికి  అడాప్షన్ ప్రాసెస్ కేవలం ఇరవై నిమిషాల్లో పూర్తయిపోతుందని, మీకు నచ్చిన పిల్లిని  పెంచుకునే అవకాశం ఉందని పిల్లి ప్రేమికులకు వివరిస్తున్నారు. కొందరు తమ ప్రచారం, ప్రకటనల్లో భాగంగా ఆకట్టుకునే పిల్లుల వీడియోలనూ పోస్టు చేస్తున్నారు.

జపాన్, సింగపూర్, థైవాన్, థాయిలాండ్ తోపాటు యూరప్, అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఈ క్యాట్ కేఫ్ లు అందుబాటులో ఉన్నాయి. పిల్లి ప్రేమికులు కేఫ్ కు వచ్చినప్పుడు పాటించాల్సిన నిబంధనలను కూడా కేఫ్ యాజమానులు ముందుగానే సూచిస్తున్నారు. పిల్లులను కొట్టడం, వినోదంకోసం విన్యాసాలు చేయించడం, గట్టిగా కౌగలించుకోవడం నిషిద్ధమని చెప్తున్నారు.  ముఖ్యంగా పిల్లులను సందర్శించేందుకు వచ్చేవారు కుక్కలను తీసుకొని రావడాన్ని నిషేధిస్తున్నారు. అంతేకాదు ఇష్టం ఉన్నవారు పిల్లలకు డొనేట్ చేయొచ్చునని, అలాగే వారింట్లో పెంచుకునే పిల్లలను కూడా తమ సంస్థలకు దత్తత ఇవ్వొచ్చని చెప్తున్నారు.

మరిన్ని వార్తలు