కార్చిచ్చు : అమెరికాను కమ్మేస్తున్న పొగ

10 Aug, 2018 08:58 IST|Sakshi

వాషింగ్టన్‌ : కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు అమెరికాను పొగతో కమ్మేస్తోంది. గత వారం రోజులుగా సుమారు 1, 87,000 ఎకరాల అడవిని ఈ కార్చిచ్చు ధ్వంసం చేసినట్లు అమెరికా జాతీయ అగ్రిమాపక సంస్థ తెలిపింది. ‘మెండోసినో కాంప్లెక్స్ ఫైర్‌’గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు వల్ల పసిఫిక్‌ ప్రాంతం నుంచి రాకీ పర్వతాల వరకు దట్టమైన పొగ ఆవరించిందని పేర్కొంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని 15 రాష్ట్రాల్లో సుమారు 100 చోట్ల మంటలు అంటుకున్నాయని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాసా విడుదల చేసింది. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో కెనడాలోని కాల్గరీ, సస్కాచ్‌వాన్‌ ప్రావిన్స్‌లు కూడా అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. 

                                                                 నాసా విడుదల చేసిన ఫొటో
ఎయిర్‌ క్వాలిటీ అలెర్ట్‌..
కాలిఫోర్నియాను కమ్మేసిన కార్చిచ్చు కారణంగా రాష్ట్రంలో ఎయిర్‌ క్వాలిటీ అలెర్ట్‌ విధించారు. ప్రమాద స్థలం నుంచి వెలువడుతున్న పొగ వల్ల కంటి, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశముందని అమెరికా డిసీజ్‌ కంట్రోల్‌ సెంటర్‌ హెచ్చరించింది. ముఖ్యంగా హృద్రోగులు, చిన్న పిల్లలపై పొగ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కాలిఫోర్నియా చరిత్రలోనే అతి పెద్ద కార్చిర్చుగా చెబుతోన్న ఈ ప్రమాదం కారణంగా రాష్ట్రం మరింత కాలుష్యంతో నిండిపోయిందని వాతావరణ నిపుణుడు స్టీవెన్‌ డిమార్టినో అన్నారు. ప్రమాద స్థలం నుంచి వెలువడుతున్న పొగ, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అమెరికాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా పర్యావరణ చట్టాల లోపం వల్లే కార్చిచ్చు ఈ రాష్ట్రాన్ని మింగేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు