నింగికి నిచ్చెన వేద్దామా?

5 Sep, 2019 03:00 IST|Sakshi

బాలభారతం సినిమాలో ఓ పాట ఉంటుంది.. అర్జునుడు బాణాలతో ఓ నిచ్చెన వేస్తే.. భీముడు ఆ మెట్లు ఎక్కుతూ అంతరిక్షానికి చేరుకుంటాడు. అంతరిక్షం అంచుల దాకా నిచ్చెన వేయడం ఆనాటి కవి కల్పన కావొచ్చు.. కానీ సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నిర్మించలేమా? ఎంచక్కా చేయొచ్చు కానీ కొంచెం రివర్స్‌గా ఆలోచిద్దాం అంటున్నారు శాస్త్రవేత్తలు.. 

స్పేస్‌ ఎలివేటర్‌..
ప్రపంచవ్యాప్తంగా అందరిలో ఆసక్తి రేకెత్తించిన అంశం ఇది. భూమ్మీది నుంచి బలమైన ఉక్కుతాళ్లతో ఓ లిఫ్ట్‌ లాంటిది నిర్మించడం తద్వారా జాబిల్లితో పాటు ఇతర గ్రహాలను సులువుగా చేరుకోవడం ఆ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశం. అయితే అందుబాటులో ఉన్న పదార్థాలు, టెక్నాలజీలతో ఈ అంతరిక్ష నిచ్చెన కట్టడం దాదాపు అసాధ్యమని తేలింది. తాజాగా కొలంబియా, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్పేస్‌ ఎలివేటర్‌ నిర్మాణానికి వినూత్న ప్రతిపాదన చేశారు. నిచ్చెన భూమ్మీది నుంచి కాకుండా.. చందమామ నుంచి వేలాడుతూ ఉండటం ఈ తాజా ఆలోచన! 

గ్రహాలను అందుకునేందుకు.. 
అంతరిక్ష ప్రయోగాల ఖర్చు కోట్లల్లో ఎందుకుంటుందో తెలుసా? భూమి గురుత్వాకర్షణ శక్తి మొత్తాన్ని అధిగమించేంత శక్తి అవసరం కాబట్టి.. బోలెడంత ఇంధనం అవసరమవుతుంది కాబట్టి. సమీప భవిష్యత్తులోనే జాబిల్లిపై మకాం పెట్టాలని అగ్రరాజ్యాలు ఆలోచిస్తుండగా.. ఎలన్‌ మస్క్‌ వంటివాళ్లు ఇంకో నాలుగేళ్లలో అంగారకుడిపై కాలనీ ఏర్పాటు చేస్తామంటున్నారు. కాబట్టి ఇలాంటివి సాధ్యం కావాలంటే స్పేస్‌లైన్‌ సూచిస్తున్న నిచ్చెన లాంటివి అత్యవసరమవుతాయి. 

కొలంబియా, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రతిపాదన ప్రకారం.. జాబిల్లిపై బలమైన తీగ లాంటిదాన్ని బిగించి దాన్ని భూస్థిర కక్ష్య వరకు వేలాడేలా చేస్తారు. భూమ్మీది నుంచి వెళ్లే రాకెట్లు.. ఈ తీగ కొనకు చేరుకుంటాయి. అక్కడే పార్క్‌ అవుతాయి. ఆ తర్వాత వ్యోమగాములు ఈ తీగ వెంబడి ఇంకో రాకెట్‌లో సులువుగా జాబిల్లిని చేరుకుంటారు. అంతరిక్షంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈ శక్తిని కూడా సౌరశక్తితో అక్కడికక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ స్పేస్‌లైన్‌ను నిర్మించేందుకు అవసరమైన అన్ని టెక్నాలజీలు, పదార్థాలు అందుబాటులోనే ఉన్నాయని జెఫైర్‌ పెనైరీ అనే శాస్త్రవేత్త తెలిపారు. 

ఎంతో కీలకం...
అతితక్కువ ఖర్చుతో వ్యోమగాములను జాబిల్లికి చేర్చడం మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో ఇతర గ్రహాలకు వెళ్లేందుకు కూడా స్పేస్‌లైన్‌ కీలకమైన నిర్మాణం కానుందని వివరించారు. భవిష్యత్తులో ఈ స్పేస్‌లైన్‌ నిర్మాణమంటూ జరిగితే.. దాన్ని టెలిస్కోపులు, అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు వాడుకోవచ్చని జెఫైర్‌ అంటు న్నారు. భూమి, జాబిల్లి తాలూకు గురుత్వశక్తులు సమానంగా.. వ్యతిరేక దిశలో ఉండే లంగ్రాంజ్‌ పాయింట్‌ ప్రాంతంలో ఇతర వ్యవస్థలను ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. పూర్తి వివరాలు ఏఆర్‌ఎక్స్‌ ఐవీ ప్రీ ప్రింట్‌లో ప్రచురితమయ్యాయి.

-సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా