సముద్రంలో పోయింది.. రెండేళ్లకు దొరికింది!

2 Apr, 2018 03:42 IST|Sakshi

ఒకినావా: ఒక్కోసారి సినిమాల్లోకంటే నిజజీవితంలో జరిగే అద్భుతాలు మనల్ని ఎంతో థ్రిల్‌ చేస్తాయి. అలాంటి ఓ ఘటనే థాయ్‌లాండ్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే.. జపాన్‌లోని ఒకినావా బీచ్‌కు సరదాగా సర్ఫింగ్‌కు వెళ్లిన సెరినా సుబకిహారా సముద్రంలో తన కెమెరాను పోగొట్టుకున్నాడు. ఎంతగా వెతికినా దొరకలేదు. సముద్రగర్భంలో కలిసిపోయిందనుకొని ఆశలు వదిలేసుకున్నాడు. ఇది జరిగి రెండేళ్లయింది. కానీ ఆయనతోపాటు ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఆ కెమెరా మళ్లీ దర్శనమిచ్చింది. 

అదీ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయ్‌లాండ్‌లో..! ఇదే ఆశ్చర్యం కలిగించే విషయమైతే.. ఆ కెమెరా చెక్కు చెదరకుండా.. పర్‌ఫెక్ట్‌గా పనిచేసే కండిషన్‌లో, ఫుల్‌ చార్చింగ్‌తో ఉందట. అదెలా దొరికిందటే.. లీ అనే వ్యక్తి పిల్లలతో కలిసి సరదాగా బీచ్‌కు వెళ్లాడు. అక్కడ తమకు దొరికిన కెమెరాను పిల్లలు లీకి తెచ్చి ఇచ్చారు. అప్పటికే దానిచుట్టూ నాచు, షెల్స్‌ వంటివి పేరుకుపోయాయి. వాటన్నింటినీ తొలగించి చూస్తే కెమెరా కనిపించింది. ఆన్‌ ఆఫ్‌ బటన్‌ నొక్కగానే ఆశ్చర్యకరంగా కెమెరా ఆన్‌ అయింది. 

పైగా అందులో బ్యాటరీ కూడా ఫుల్‌గా ఉందట. దీంతో ఎలాగైనా దానిని పోగొట్టుకున్న వ్యక్తికి అందజేయాలనుకున్నారు. అందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా ఎంచుకొని విషయమంతా ఫొటోలతో సహా అందులో రాశారు. అలా.. చివరకు తన కెమెరా గురించి తెలుసుకున్న సెరినా సుబకిహారా ఎంతో ఆనందపడ్డాడు. కెమెరాను తిరిగి ఇచ్చినందుకు లీ, పిల్లల బృందానికి థ్యాంక్స్‌ చెప్పాడు.  రెండేళ్లు నీళ్లలో ఉన్నా చెక్కు చెదరకుండా కాపాడిన వాటర్‌ప్రూఫ్‌ కేస్‌కు, కెమెరా తన వద్దకు చేరడానికి సహకరించిన ఫేస్‌బుక్‌ స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాడు.  
 

మరిన్ని వార్తలు