కాంతిని స్లోమోషన్‌లో చూడాలనుందా?

15 Oct, 2018 01:27 IST|Sakshi

ఈ కెమెరాతో సాధ్యమే

సెకనుకు 10 లక్షల కోట్ల ఫ్రేములను కేప్చర్‌ చేయగలదు

వాషింగ్టన్‌: కాంతిని అత్యంత స్లో మోషన్‌లో బంధించగల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కెమెరాను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కెమెరా సెకనుకి 10 లక్షల కోట్ల ఫ్రేమ్స్‌ను కేప్చర్‌ చేయగలదని తెలిపారు. ఇంత వరకు అంతుచిక్కని కాంతి, పదార్థం మధ్య జరిగే చర్యల గురించి తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ కెమెరాను అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. కాంతి అధ్యయన శాస్త్రంలో ఇటీవల పుట్టుకొచ్చిన కొత్త ఆవిష్కరణల వల్ల జీవ, భౌతిక శాస్త్రాల్లో అతి సూక్ష్మ విశ్లేషణలకు కొత్త దారులు తెరుచుకున్నాయి.

ఈ పద్ధతులను వినియోగించుకోవాలంటే, ఒకేసారి షార్ట్‌ టెంపోరల్‌ రిజల్యూషన్‌లో చిత్రాలను కచ్చితత్వంతో రికార్డు చేయాలి. అయితే ప్రస్తుతం ఉన్న ఇమేజింగ్‌ పద్ధతుల ద్వారా అల్ట్రాషార్ట్‌ లేజర్‌ పల్సస్‌ పద్ధతి ద్వారా ఈ విశ్లేషణలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. కంప్రెస్డ్‌ అల్ట్రాఫాస్ట్‌ ఫొటోగ్రఫీ (కప్‌) టెక్నాలజీ కొంతమేరకు ఉపయోగకరంగా ఉన్నా.. పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేదని తెలిపారు. ఇప్పుడు ఈ టెక్నాలజీనే మరింత మెరుగుపర్చి నూతన సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

సెకనుకు క్వాడ్రిలియన్‌ ఫ్రేమ్స్‌ను బంధించే ఫెమ్‌టో సెకండ్‌ సామర్థ్యమున్న కెమెరాకు స్థిర చిత్రాలను బంధించే మరో కెమెరాను జతచేశారు. దీంతో అత్యంత నాణ్యమైన చిత్రాలను సెకనుకి 10 ట్రిలియన్ల ఫ్రేమ్స్‌ వరకు బంధించవచ్చని కాల్‌టెక్‌ ఆప్టికల్‌ ఇమేజింగ్‌ లాబోరేటరీ(కాయిల్‌) డైరెక్టర్‌ లిహాంగ్‌ వాంగ్‌ వెల్లడించారు. టీ–కప్‌గా పిలిచే ఈ నూతన కెమెరా సాయంతో బయో మెడికల్, మెటీరియల్‌ సైన్స్, ఇతర విభాగాలకు అవసరమైన కొత్తతరం మైక్రోస్కోప్‌లను అభివృద్ధి చేయవచ్చని వాంగ్‌ తెలిపారు. ఈ కెమెరాను ఉపయోగించి తొలుత 25 ఫ్రేములలో 400 ఫెమ్టో సెకన్ల వ్యవధిలోనే కాంతి పుంజం ఆకారం, తీవ్రత, పరావర్తన కోణాన్ని పరిశీలించినట్లు చెప్పారు. దీని వేగాన్ని భవిష్యత్తులో సెకనుకు క్వాడ్రిలియన్‌ ఫ్రేములకు పెంచడానికి అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు